-ఈబీసీ నేస్తం పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి…
-ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రవర్ణ పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా.. 45 – 60 ఏళ్లలోపు వయసున్న వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు అందించబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం బడ్జెట్ లో ఇప్పటికే రూ. 750 కోట్లు కేటాయించినట్లు తెలియజేశారు. అగ్రకులాలకు చెందిన పేదల ప్రయోజనాల కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకుగానూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ మేరకు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమైన ఇంటింటి సర్వే.. అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం వివిధ దశల్లో పరిశీలించి తుది జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. ఎంపిక పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని తెలిపారు. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమతో పాటు ఇతర అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలు ఈ పథకానికి అర్హులని తెలియజేశారు. ఇందుకోసం ఆధార్, బ్యాంక్ ఖాతా, కులధ్రువీకరణ పత్రం, ఆదాయ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. కావున సెంట్రల్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతిఒక్కరూ అవసరమైన ధృవీకరణ పత్రాల నకలు కాపీలతో మీమీ పరిధిలోని వార్డు సచివాలయాలలో ఈనెల 4, 5, 6 7 తేదీలలో దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరారు. మరీముఖ్యంగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు చివరి నాలుగు రోజుల్లో అప్రమత్తంగా ఉంటూ అర్హులైన ప్రతిఒక్కరి చేత దరఖాస్తులు నమోదు చేయించవలసిందిగా కోరారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతి కోరుకునే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఈసందర్భంగా మల్లాది విష్ణు మరోసారి స్పష్టం చేశారు.