Breaking News

ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు…

-ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న హెలీకాప్టర్‌ రైడ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలకు విచ్చేసే భక్తులు విజయవాడ నగర అందాలను ఆకాశమార్గం నుంచి వీక్షించేందుకు హెలీ రైడ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు.
మంగళవారం దసరా మహోత్సవ ఏర్పాట్లను నగరంలోని సీతమ్మవారి పాదాలు విఘ్నేశ్వర ఆలయం నుంచి భక్తులకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు, విఐపీలకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ మరియు నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. వీరితో పాటు విజయవాడ మున్సిపల్ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డా. కె.మాధవీలత, సబ్ కలెక్టర్ జిఎస్ఎస్.ప్రవీణ్ చంద్, ఆలయ ఈఓ భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేశఖండన కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని వారు పరిశీలించారు. అక్కడ ఎగుడుదిగుడుగా ఉండటంతో ఆలయ ఇంజనీర్ల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశఖండన కోసం బల్లలు ఏర్పాటు చేయాలని, చదును చేసే ప్రక్రియను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే చేపట్టాలని సూచించారు. జల్లు స్నానాల కోసం సీతమ్మవారి పాదాల వద్ద చేసిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. సీతమ్మపాదాలు, కృష్ణవేణిఘాట్ మధ్యలో ట్రాఫిక్ గోడను పగులగొట్టి ప్రత్యేకంగా భక్తులు వచ్చే ఏర్పాట్లు చేయమని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. క్యూలైన్లు, ప్రవేశద్వారాల వద్ద ఏర్పాట్లు చేసిన బారీకేడ్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయం లిఫ్ట్ దారికి కుడి వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని చూశారు. అక్కడ కూడా లెవెలింగ్ సరిగా చేయలేదని వర్షం పడితే వాహనాలు ఇరుక్కుపోతాయని, అందువల్ల ఆ స్థలాన్ని చదును చేయాలని ఆదేశించారు.
అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా ఆకాశం నుంచి నగర అందాలను వీక్షించేందుకు హెలీ రైడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఇంద్రకీలాద్రిని ఆకాశం నుంచి వీక్షించవచ్చన్నారు. ప్రతి ప్రయాణికుడిని 6 నిముషాల పాటు ఆకాశంలో హెలీకాఫ్టర్ తిరుగుతుందన్నారు. దీనికోసం ప్రతి ప్రయాణికుడి నుండి 3,500 రూపాయలు వసూలు చేస్తామన్నారు. అలాగే 15 నిముషాలు ప్రయాణించే ప్రయాణికుల నుంచి 6 వేల రూపాయలు వసూలు చేస్తామన్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా దుర్గామాతను దర్శించుకొనే భక్తులు కచ్చితంగా ఆన్ లైన్ ద్వారానే తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. అందులో ఉచిత దర్శనానికి 4 వేలు, మరో 3 వేల టికెట్లు 300 రూపాయలకు, అలాగే మరో 3 వేల టికెట్లు 100 రూపాయలకు విక్రయిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతిస్తామన్నారు.
నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు వీలుగా పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రోజూ 10 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొనేలా రెవెన్యూ, దేవాదాయ, వీఎంసి, నీటిపారుదలశాఖ, దేవస్థాన అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేస్తున్నామన్నారు. భవానీ మాలధారణతో వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఘాట్లలో నదీ స్నానాలకు అనుమతి లేదని జల్లుస్నానాలకు సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకరరావు, ఆలయ ఇఇ భాస్కర్ కూడా హాజరయ్యారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *