-కోతలు, గాట్లతో కూడిన సంప్రదాయ సర్జరీలకు ఇక కాలం చెల్లు
-ట్యావి ప్రొసిజర్ చికిత్సతో ఒక్క రోజులోనే డిశ్చార్జ్
-డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోతలు, గాట్లతో కూడిన సంప్రదాయ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది. కోతల్లేని సర్జరీలు బాగా ప్రాచూర్యంలోకి వస్తున్నాయి. గుండె జబ్బుల చికిత్సల్లోనూ ఇటీవల కాలంలో దెబ్బతిన్న అయోటిక్ కవాటాన్ని మార్పిడి చేయడానికి ఇంతకు ముందు పెద్దగా కోత పెట్టి ఆపై గుండెను తెరిచి కవాట మార్పిడి చేసేవారు. అయితే తాజాగా గజ్జల్లోని రక్త నాళం గుండా క్యాథటర్‌ని గుండె వద్దకు పంపి కోత పెట్టకుండానే అయేటిక్ కవాటాన్ని మార్పిడి చేస్తున్నారు. ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ ఇన్‌ప్లాంటేషన్ (ట్యావి ప్రొసిజర్)గా పిలిచే ఈ సరికొత్త చికిత్సను విజయవాడలోని ప్రముఖ చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు హార్ట్‌కేర్ సెంటర్‌లో ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఈ సందరంగా ఆ చికిత్స వివరాలను డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడకు చెందిన గంగాధర్ ప్రసాద్(58) అనే వ్యక్తి గడచిన పదేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని అప్పటి నుంచి తమ వద్ద చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సాధారణంగా గుండెకు కోత పెట్టి ఆపరేషన్ చేస్తే భవిష్యత్తులోనూ 10 నుంచి 20 శాతం వరకు ప్రాణానికి రిస్క్ ఉంటుందన్నారు. కానీ.. సరికొత్త చికిత్స అయిన ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ ఇన్‌ప్లాంటేషన్ ద్వారా కేవలం గంటన్నర వ్యవధిలో నిర్వహించారు. ఈ చికిత్స అనంతరం భవిష్యత్తులోనూ ఎటువంటి రిస్క్ లేకుండా రోగి ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. గంగాధర్ ప్రసాద్ గుండెలో ఉన్న మేజర్ వాల్ బాగా సన్నబడిపోవడంతో ఇటీవల చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. అయితే ఆయన ఆపరేషన్‌కు అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఇక్కడ అయోటిక్ వాల్ రీప్లేస్‌మెంట్, ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ ఇన్‌ప్లాంటేషన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ ఇన్‌ప్లాంటేషన్ (ట్యావీ ప్రొసిజర్) చికిత్స కేవలం చెనై, హైద్రాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో మాత్రమే జరుగుతున్నట్లు, ఇప్పటివరకు విజయవాడలో అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి టెక్నిషియన్‌ను రప్పించి తన నేతృత్వంలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ చైతన్య, డాక్టర్ ఆకాష్ పల్లెం, డాక్టర్ గుంటూరు వరుణ్, డాక్టర్ ముత్తుకుమార్, డాక్టర్ ప్రశాంత్ ప్రభు, ఎనస్థీషియా వైద్యులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ ఉషారాణి బృందం సహకారంతో ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ ఇన్‌ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. హార్ట్‌ను ఓపెన్ చేయకుండా గజ్జల్లోని రక్తనాళం ద్వారా క్యాథటర్‌ని గుండె వద్దకు పంపి వెడల్పు చేయడం ద్వారా ఎటువంటి రిస్క్ లేకుండా చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. చికిత్స అనంతరం కేవలం ఒక్క రోజులోనే రోగిని డిశ్చార్జ్ చేశామన్నారు. ఈ చికిత్స ద్వారా రోగి తన రోజువారీ పనులు చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ సరికొత్త చికిత్సను సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ప్రముఖ కార్డియో ధోరాసిక్ సర్జన్ డాక్టర్ గుంటూరు వరుణ్, కార్డియో అనస్తేషియా డాక్టర్ కె రామ్మోహన్, డాక్టర్ ఆకాష్ పల్లెం తదితరులు పాల్గొన్నారు.