-ప్రజలకు సత్వర సేవలన్నదే సచివాలయ వ్యవస్థ ముఖ్యఉద్దేశం…
– పి ఆర్ కమీషనర్ కోన శశిధర్
విజయవాడ/కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సకాలంలో సేవలు అందించి ప్రజల పట్ల జవాబుదారీగా వుండాలని పంచాయతీ రాజ్, గ్రామీణభివృధ్ది శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి కమిషనర్ గా నియమితులైన కోన శశిధర్ గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని పరిటాల 1,2 గ్రామ సచివాలయాలను మంగళవారం సందర్శించారు. వీరి వెంట జెసి (అభివృధి) ఎల్.శివశంకర్ కూడ పాల్గొన్నారు. వీఆర్వో, సచివాలయం అడ్మిన్ లతో పాటుగా సిబ్బంది అందరితో మాట్లాడుతూ సచివాలయం ద్వారా ఏవిధమైన సేవలు ఏ రీతిన అందిస్తున్నది తెలుసుకున్నారు.వివిధ సిబ్బంది అందిస్తున్న సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి ఏ మేర ఉందొ అడిగి తెలుసు కున్నారు. ఆయా సేవలకు నిర్దేశించిన కాలపరిమితి మేరకు ప్రజలకు సేవలు అందించాలన్నారు,అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించవచ్చునన్నారు. సచివాలయం సిబ్బంది అందరూ యూనిఫాం వేసుకొని వుండడం పై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కృష్ణా జిల్లా లోనే యూనిఫాం అమలు లోకి తీసుకొచ్చిన జెసి శివశంకర్ ను శశిధర్ ప్రత్యేకంగా అభినందించారు.
పరిటాల సచివాలయానికి ఐ ఎస్ వో 9000 సర్టిఫికేట్ కూడా వచ్చిందని జెసి కమిషనర్ శశిధర్ తో చెప్పారు. ఆలాగే జిల్లాలో 114 సచివాలయాలకు కూడా ఐ ఎస్ వో సర్టిఫికేట్ వచ్చిందన్నారు.చాలా చక్కగా సచివాలయాలు నిర్వహిస్తున్నారని జెసి శివశంకర్ ను ఆయన అభినందించారు.కృష్ణా జిల్లా ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని సచివాయాల వ్యవస్థ తీర్చి దిద్దుతామని ఆయన చెప్పారు. అనంతరం గ్రామం లో జరుగు తున్న జగనన్న శాశ్వత భూ హక్కు పథకం క్రింద జరుగు తున్న సర్వే తీరును కూడా శశిధర్ పరిశీలించారు. ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.ఎన్ని ఆస్తులు వున్నాయో,స్థలాలు,భవనాలు అన్ని మాపింగ్ చేసి ,పక్కగా సర్వే చేయాలని సిబ్బంది ని కోరారు. జెడ్పీ సిఈవో సూర్య ప్రకాష్, పీఆర్ ఎస్ ఐ వీర స్వామి, డ్వామా పిడి సూర్య నారాయణ, డీపివో జ్యోతి, ఎంపీడీఓ శిల్ప తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.