-శేషవస్త్రాలతో సత్కరించిన వేద పండితులు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీకొండాలమ్మ అమ్మవారికి దసరా నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రి కొడాలి నానికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలతో మంత్రి కొడాలి నాని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీకొండాలమ్మకు మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో మంత్రి కొడాలి నానికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం అమ్మవారి శేష వస్త్రాలతో మంత్రి కొడాలి నానిని ఘనంగా సత్కరించారు. శ్రీకొండాలమ్మ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శ్రీకొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా సందర్భంగా నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించామని తెలిపారు. అమ్మవారి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరోనా విపత్కర పరిస్థితులు తొలగిపోవాలని ప్రార్థించారు. సీఎం జగన్మోహనరెడ్డికి అవసరమైన శక్తియుక్తులను అందజేయాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బాడిగ లీలాసౌజన్య, మన్నెం అమల, పడవల వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామి, డోకాల భాగ్యలక్ష్మి, వల్లూరి పద్మావతి, నారేపాలెం వెంకట నిర్మల, ఈడే విజయ నిర్మల, ఎక్స్అఫీషియో సభ్యుడు ఆర్ఎస్ఎస్ సంతోష్ శర్మ, గుడ్లవల్లేరు ఎంపీపీ కొడాలి సురేష్, పార్టీ మండల అధ్యక్షుడు శాయన రవికుమార్, నాయకులు పెన్నేరు ప్రభాకర్, శేషం గోపి, ఎం లక్ష్మణరావు, అల్లూరి ఆంజనేయులు, రిటైర్డ్ కార్యనిర్వహణాధికారి ధర్మారాయుడు తదితరులు పాల్గొన్నారు.