విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య జోన్‌లో భద్రత, సరుకు రవాణా లోడిరగ్ మరియు రైళ్ల రవాణాలో సమయపాలన మొదలగు పలు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుండి నేడు అనగా 13 అక్టోబర్ 2021 తేదీన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులు, ఆరు డివిజన్లు అయిన విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజినల్ రౖౖెల్వే మేనేజర్లు (డీఆర్‌ఎమ్‌లు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛ ఇంధన శక్తిని ప్రోత్సాహిస్తూ రవాణా రంగంలో స్థిరమైన అభివృద్ధిని సాధించిన సందర్భంగా పర్యావరణ సమతుల్యతపై ఒక ఇ`పుస్తకాన్ని జనరల్ మేనేజర్ ఈ సమావేశంలో ఆవిష్కరించారు. రైల్వేలో ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సాహించడం మరియు రైలు వినియోగదారుల కోసం శుభ్రత నిర్వహణ ఈ పుస్తకం లక్ష్యం. పర్యావరణ రక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన వివిధ కార్యక్రమాల సంగ్రహమే ఈ పుస్తకం. పర్యావరణ సమతుల్యత కోసం చర్యలు, ఘణ వ్యర్థాల నిర్వహణ, హౌస్ కీపింగ్ కార్యకలాపాలు, చెట్ల పెంపకం మరియు ఇతర పర్యావరణ హిత కార్యకలాపాలు మొదలగు అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఈ పుస్తక రూపకల్పనలో కృషి చేసిన అధికారులు మరియు సిబ్బంది పనితీరును జనరల్ మేనేజర్ అభినందించారు. ఇ`పుస్తకం పర్యావరణ హితం కోసం దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న కృషిపై అవగాహన కలిగిస్తుందన్నారు మరియు పర్యావరణ రక్షణకు మరిన్ని వినూత్న చర్యలు చేపట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.
జోన్ పరిధిలోని రైళ్ల నిర్వహణలో భద్రతా అంశాలను శ్రీ గజానన్ మాల్య ఈ సమావేశంలో సమీక్షించారు. రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనుకోని ఏవేని సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అన్ని పాయింట్ల వద్ద మరియు క్రాసింగుల వద్ద భద్రతా తనిఖీలను పెంచాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించడంలో మరింత అప్రమత్తంగా మరియు కచ్చితంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్ పరిధిలో నిర్ధేశించుకున్న విధంగా లెవల్ క్రాసింగ్ గేట్ల (ఎల్‌సీల) తొలగింపు పురోగతిని జనరల్ మేనేజర్ సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఓబీ/ఆర్‌యూబీల నిర్మాణ పనులను సమీక్షించిన ఆయన అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసే విధంగా పనులను వేగవంతం చేయాలని డివిజినల్ రైల్వే మేనేజర్లను ఆదేశించారు. జనరల్ మేనేజర్ జోన్‌లో సరుకు రవాణా పనితీరు మరియు బొగ్గు రవాణాపై సవివరంగా సమీక్షించారు. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వలపై ప్రస్తుతం కొనసాగుతున్న క్లిష్ట పరిస్థితి దృష్ట్యా విద్యుత్ ప్లాంట్లకు నిరాటంకంగా బొగ్గు రవాణా అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. దేశ వ్యాప్తంగా బొగ్గు సరఫరాలో వేగవంతం కోసం ‘‘త్రిశూల్’’ మరియు ‘‘గరుడ’’ వంటి భారీ రైళ్లను మరిన్ని సంఖ్యలో నడపాలని ఆయన సూచించారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …