-దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీ శరన్నవరాత్రులలో భాగంగా గురువారం నియోజకవర్గంలోని బావాజీ పేట, న్యూ ఆర్.ఆర్.పేట, అజిత్ సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లల్లో దేవాలయాలలో ఉత్తమ నిర్వహణ పద్ధతులు తీసుకువచ్చామన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాల కల్పనలోనూ ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేస్తూ.. గుడికో గోమాత సహా ఎన్నో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజల్లో భక్తి భావన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకొని సన్మార్గంలో పయనించాలని.. అప్పుడే సమాజం సుఖ:సంతోషాలతో ఉంటుందని వ్యాఖ్యానించారు. అనంతరం పలుచోట్ల దాతలు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు అన్నవితరణ చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని.. దానాలన్నింటిలోను అన్నదానం మహాశ్రేష్టమైనదని అన్నారు. పేదల ఆకలి తీర్చడం, తోటివారికి సహాయం చేయడం దైవ్య కార్యాలతో సమానమన్నారు. కనుక ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో పేదలకు సహాయసహకారాలు అందించి దానగుణాన్ని చాటుకోవాలని కోరారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బాలి గోవింద్, ఇసరపు దేవి రాజా రమేష్, వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకులు హఫీజుల్లా తదితరులు పాల్గొన్నారు.