-28.3 లక్షల ఇళ్లలో ఎకో-నివాస్ సంహిత ఈసీబీసీ కోడ్
-ఇండో-స్విస్ బీఈఈపీ మద్దతుతో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
-పేద ప్రజలకు అత్యుత్తమ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
-ఈఎన్ఎస్ పూర్తిగా స్వచ్ఛందం.. తప్పనిసరేమీ కాదు..
-లబ్ధిదారుల సమ్మతితోనే ఈఎన్ఎస్ అమలు
-గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
-దేశంలో మొత్తం విద్యుత్తు వినియోగంలో 38 శాతం నివాస భవనాలదే
-ఏపీలో నివాస భవనాల రంగమే 17,154 మిలియన్ యూనిట్లు వినియోగిస్తోంది
-మొత్తం వినియోగంలో ఇది 28 శాతం
-ఈఎన్ఎస్ అమలుతో ఇళ్లలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
-రాష్ట్రంలో 13 వేల మంది శిక్షణ ఇవ్వనున్న బీఈఈపీ
-ఈఈ కార్యక్రమాల అమలులో డిస్కంలు సంపూర్ణ మద్దతు అందిస్తాయి
-ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు
విజయవాడ /తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు అత్యుత్తమ ఇళ్లను అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. పేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఇళ్లలో ప్రపంచ శ్రేణి ఇంధన సామర్థ్య టెక్నాలజీని అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా లబ్ధిదారుల కోసం నిర్మించే ఇళ్లతో పాటు రాష్ట్ర భవన నిర్మాణ రంగానికి, పర్యావరణానికీ మేలు జరుగుతుంది. లబ్ధిదారులకు కరెంటు బిల్లులు కూడా ఆదా అవుతాయి.
బీఈఈపీ, ఏపీఎస్ఈసీఎం ఆధ్వర్యంలో ఎకో-నివాస్ సంహిత (ఈఎన్ఎస్)పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతిలో నిర్వహించిన సెమినార్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు అత్యుత్తమ గృహాలను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 28.3 లక్షల ఇళ్లలో అంతర్జాతీయ ఇంధన సామర్థ్య టెక్నాలజీలను అమలు చేయాలని నిర్ణయించినందున ‘ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్ -రెసిడెన్షియల్ బిల్డింగ్స్ (ఈసీబీసీ-ఆర్)’పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎకో-నివాస్ సంహితపై అవగాహన పెంచడం, ఇంధన సామర్థ్యం, థర్మల్లీ కంఫర్టబుల్ బిల్డింగ్ డిజైన్ ను అర్థం చేసుకోవడం, తిరుపతిలో ఈఎన్ఎస్ అమలులో ఎదురయ్యే పలు సవాళ్లపై చర్చించడం కోసమే ఈ సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. ఇండో-స్విస్ బీఈఈపీ మద్దతు, లబ్ధిదారుల సమ్మతితోనే ఈఎన్ఎస్ అమలు చేయనున్నట్లు చెప్పారు. దీని అమలుతో 20 శాతం విద్యుత్తు ఆదా అయ్యేందుకు అవకాశం ఉందన్నారు.
వాణిజ్య, నివాస భవనాల్లో ఈసీబీసీ వంటి ఇంధన సామర్థ్య (ఈఈ) కార్యక్రమాలను అమలు చేయడంతో వినియోగదారులు లబ్ధి పొందడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని అజయ్ జైన్ చెప్పారు. దేశంలో అత్యధికంగా విద్యుత్తు వినియోగించేది నివాస భవనాలేనన్నారు. మొత్తం వినియోగంలో 38 శాతం నివాస భవనాలదేనని తెలిపారు. ఏపీలో మొత్తం వార్షిక డిమాండ్ 60943 మిలియన్ యూనిట్లు కాగా.. గృహ వినియోగదారులే 17154 మిలియన్ యూనిట్లు (28%) వినియోగిస్తున్నట్లు వివరించారు.
కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంధన కోడ్స్ అమలు అత్యంత ప్రధానమని అజయ్ జైన్ అన్నారు. జగనన్న కాలనీల్లో ఈఎన్ఎస్ అమలులో ఇండో-స్విస్ బీఈఈపీ సాంకేతిక మద్దతు తీసుకోవడం వల్ల ఇళ్లలో ఉష్ణోగ్రతలు తగ్గడమేగాక థర్మల్ కంఫర్ట్ పెరుగుతుందని వివరించారు. అలాగే ఇంధన వినియోగం తగ్గుతుందని, కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని తెలిపారు. ఇండో-స్విస్ బీఈఈపీ కేంద్ర విద్యుత్తు శాఖ, స్విట్జర్లాండ్ ప్రభుత్వాల ద్వైపాక్షిక సహకార ప్రాజెక్టు అని.. దీన్ని బీఈఈ అమలు చేస్తోందని వివరించారు.
జగనన్న కాలనీల్లో 28.3 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నారని, ఇది దేశంలోనే అతిపెద్ద కార్యక్రమమని అజయ్ జైన్ తెలిపారు. అత్యంత నాణ్యమైన నిర్మాణం, లబ్ధిదారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అత్యుత్తమ విధానాలను అనుసరించడం.. ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను అనుసరించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారని వెల్లడించారు.
ఎకో-నివాస్ సంహితపై 13000 మంది గృహ నిర్మాణ శాఖ/ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు బీఈఈపీ ముందుకొచ్చింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించనుంది. అదేసమయంలో ఈఎన్ఎస్ అమలుతో కలిగే ప్రయోజనాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో పాటు ఈసీబీసీ రెసిడెన్షియల్ కోడ్ అమలుకు వారి సమ్మతి తీసుకోవాలని చెప్పారు.
13000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అతిపెద్ద కార్యక్రమమని ఇండో-స్విస్ బీఈఈపీ భారత్ ప్రతినిధి సమీర్ మైథెల్ తెలిపారు. భవన నిర్మాణ రంగంలో ఈఈ అమలుకు ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారని చెప్పారు. తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించేందుకు ఏపీ గృహ నిర్మాణ శాఖ అంగీకరించిందని, పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
‘‘ఎస్ఈసీఎం, ఇండో-స్విస్ బీఈఈపీ సహకారంతో ఈఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రజాప్రయోజనార్థం, భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఈఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అనుసరిస్తున్నాం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ను దేశంలోనే అత్యుత్తమ ఇంధన సామర్థ్య కార్పొరేషన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అందుకోసం కొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నాం. ఇంధన సామర్థ్య గృహ నిర్మాణ పథకానికి 5 శాతం ఎక్కువ ఖర్చు పెట్టినట్లయితే దానివల్ల లబ్ధిదారులకు 50 శాతానికిపైగా ప్రయోజనం కలుగుతుంది. అలాగే పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుంది’’ అని తిరుపతి మున్సిపల్ కమిషనర్ పి.ఎస్.గిరీష చెప్పారు.
రాష్ట్రంలో ఇంధన సామర్థ్యం, సంరక్షణ కార్యక్రమాల అమలుకు ఏపీ డిస్కంలు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు చెప్పారు. ‘‘ఒక్క మెగావాట్ సౌర విద్యుత్తు ప్లాంటు కోసం కొన్నేళ్ళ కిందట రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెట్టేవారు. అదే ప్లాంటును ఇప్పుడు రూ.2 కోట్ల కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మిస్తున్నారు . అది కూడా 3,4 నెలల్లోనే పూర్తి చేస్తున్నాం. థర్మల్ ప్లాంటు నిర్మాణానికి 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది. వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ఈఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఇంధన సామర్థ్యంపై వినియోగదారులకు పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాం’’ అని తెలిపారు.
ఈఎన్ఎస్ తప్పనిసరేమీ కాదని, ఆప్షనల్ అని హౌసింగ్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. భాగస్వామ్యులు/లబ్ధిదారులను ఒప్పించి, వారి సమ్మతితోనే ఈఎన్ఎస్ ను అమలు చేస్తామని.. తద్వారా లబ్ధిదారులు ఎంతగానో లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ సెమినార్లో ఆస్కి నుంచి డాక్టర్ రాజ్ కిరణ్, ఇండో-స్విస్ బీఈఈపీ నుంచి ఆనంద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.