Breaking News

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్ర‌గ‌తికి కీల‌కం

-నూత‌న జ‌నాభా నిర్వ‌హ‌ణ విధానంలో స‌మ‌గ్ర కార్యాచ‌రణ ప్ర‌తిపాద‌న‌
-నైపుణ్యావ‌స‌రాల గుర్తింపు, ల‌భ్య‌త‌లో వ్య‌త్యాసాల నిర్మూల‌న ల‌క్ష్యం
-95 శాతం ప్ర‌జ‌లకు డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త
-పారిశ్రామిక అవ‌స‌రాలకు అనుగుణంగా నైపుణ్య శిక్ష‌ణ‌
-అవ‌కాశాలను వినియోగించుకోవాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సంతానోత్ప‌త్తి పెంపున‌కు ఆటంకంగా ఉన్న ఆర్థికప‌ర‌మైన స‌మ‌స్య‌ల్ని ప‌రిష్కరించే దిశ‌గా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఉత్పాద‌క సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విస్తృత నైపుణ్య వికాస ప్ర‌ణాళిక‌ను రూపొందించింద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. జ‌నాభా స్థిరీక‌ర‌ణ ల‌క్ష్యంగా రూపొందించిన నూత‌న విధానంలో ఈ నైపుణ్యాభివృద్ధి ప్ర‌ణాళిక‌ను పొందుప‌రిచార‌ని మంత్రి సోమ‌వారంనాడు ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు. నేటి శ‌తాబ్ద‌పు ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అన్ని వ‌య‌సుల వారికి నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

నూత‌న జ‌నాభా నిర్వ‌హ‌ణ విధానంలో భాగంగా ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణంతో పాటు ప్ర‌జ‌ల ఆర్థిక సుస్థిర‌త కోసం అంద‌రికీ నైపుణ్యాభివృద్ధి ఆవ‌శ్య‌క‌తను గుర్తించి, ఆ మేర‌కు కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి వివ‌రించారు. ఆర్థిక‌, సామాజిక రంగాల‌కు అవ‌స‌ర‌మైన సేవ‌ల డిమాండ్ గుర్తింపు, ల‌భ్య‌త‌ల మ‌ధ్య వ్య‌త్యాసాల‌ను గుర్తించి, కొర‌త‌ను తీర్చే దిశ‌గా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు. 21వ శ‌తాబ్ద‌పు ఆర్థిక వ్య‌వ‌స్థ వికాసంలో అంద‌రూ పాల్గొనే విధంగా దోహ‌ద‌ప‌డేందుకు నూత‌న జ‌నాభా నిర్వ‌హ‌ణ కోసం రూపొందించిన 5 స్థంభాల్లో (5 పిల్ల‌ర్స్‌) భాగంగా నైపుణ్యం అంశాన్ని పొందుప‌రిచిన‌ట్లు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు.

‘నైపుణ్యం’ ల‌క్ష్యాలు

ఈ దిశ‌గా…2035 నాటికి 95 శాతం ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ అక్ష‌రాస్య‌తను క‌ల్పించ‌డం, 75 శాతం ప్ర‌జ‌ల‌కు గుర్తించిన మేర‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వ‌డం, శిక్ష‌ణ పొందినవారిలో 80 శాతానికి పైగా ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌డం, శిశు సంర‌క్ష‌ణ మ‌రియు వృద్ధులకు అవ‌స‌ర‌మైన సేవ‌లందించేందుకు ల‌క్ష మందికి స‌ర్టిఫికెట్ కోర్సుల్ని అందించ‌డం, శ్రామిక శ‌క్తి భాగ‌స్వామ్యంలో మ‌హిళ‌ల వాటాను 25 శాతం పెంచ‌డం వంటి ల‌క్ష్యాల్ని నిర్ధారించిన‌ట్లు మంత్రి తెలిపారు.

పారిశ్రామిక ప్ర‌గ‌తికి దోహ‌దం

రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెరుగుతున్నందున పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్ని చేప‌డ‌తార‌ని, ఈ దిశ‌గా ఐటి, గ్రీన్ ఎన‌ర్జీ, ఎల‌క్ట్రానిక్స్‌, క్వాంటం కంప్యూటింగ్ కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని మంత్రి పేర్కొన్నారు. రూ. 13 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డుల కోసం విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన 610 ఎంవోయు(MoUs)లు , ఇత‌ర ఒప్పందాల మేర‌కు అవ‌స‌రాల్ని గుర్తించి కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంద‌ని మంత్రి వివ‌రించారు. శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌లో పారిశ్రామిక వేత్త‌లు, ఇత‌ర పెట్టుబ‌డిదారుల‌కు త‌గు ప్రాతినిధ్యాన్ని క‌ల్పిస్తామ‌న్నారు.

శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌

మూడంచెల‌లో నైపుణ్యాభివృద్ధి క‌లిగించేలా కార్య‌క్ర‌మాలుంటాయ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. పిన్న వ‌య‌సు నుండే త‌గు సామ‌ర్ధ్యాన్ని క‌ల్పించే దిశ‌గా ప్రాథ‌మిక స్థాయి కోర్సులు పెట్ట‌డంతో పాటు ఇప్ప‌టికే ప‌నిచేస్తున్న వివిధ వ‌య‌స్కుల వారి ఉత్పాద‌క‌ను పెంచేందుకు కూడా శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుంద‌ని మంత్రి తెలిపారు. ఈ దిశ‌గా 6వ త‌ర‌గ‌తి నుంచే త‌గు విష‌య ప‌రిజ్ఞానాన్ని క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ల‌కు అనుగుణంగా శిశు పాల‌న మ‌రియు వృద్ధాప్య సేవ‌లందించేందుకు గాను ల‌క్ష మందికి శిక్ష‌ణ ఇచ్చేందుకు రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌న్నారు. ఉన్న‌త స్థాయి నైపుణ్యావ‌స‌రాల‌ను తీర్చేందుకు సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

నేర్చుకోవ‌డం అనేది 25 ఏళ్ల‌కు ప‌రిమితం కాద‌ని, వ‌య‌సు మీరిన వారికి కూడా వివిధ అంశాల్లో శిక్ష‌ణ ఇచ్చి అన్ని వ‌య‌సుల వారూ సామాజిక, ఆర్థిక వికాసానికి దోహ‌ద‌ప‌డేలా చ‌ర్య‌లుంటాయ‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు. స‌మ‌గ్ర ఆర్థిక‌, సామాజిక ప్ర‌గ‌తి ద్వారా ఐచ్ఛికంగా అధిక సంతానోత్ప‌త్తి దిశ‌గా భార్యాభ‌ర్త‌లు నిర్ణ‌యాన్ని తీసుకునేలా వీలైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు, త‌ద్వారా జ‌నాభా స్థిరీక‌ర‌ణ‌తో 2.40 ట్రిలియ‌న్ కోట్ల రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌క్ష్య సాధ‌న దిశ‌గా కార్య‌క్ర‌మాల్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో పిన్న వ‌య‌స్కులు, వృద్ధుల స‌మ‌తూకంతో సుస్థిర అభివృద్ధి కోసం సంతానోత్ప‌త్తి రేటు 2.10 అవ‌స‌రంకాగా, ప్ర‌స్తుతం ఈ రేటు 1.50 మాత్ర‌మే ఉండ‌డంపై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అనుకూల‌మైన జ‌నాభా స్థిరీక‌ర‌ణ దిశ‌గా ప్ర‌భుత్వం స‌మ‌గ్ర విధానాన్ని రూపొందించింద‌ని మంత్రి తెలిపారు. ఈ దిశ‌గా సాగే ప్ర‌య‌త్నాల్లో భాగంగా ల‌భించే అవ‌కాశాల‌ను అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *