-లైసెన్సులేకుండా బాణ సంచా దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం…
-బైపాస్ రోడ్ నందు గల ఖాలీ స్థలంలో బాణసంచా దుకాణాలకు అనుమతి…
-ఆర్డీవో శ్రీనుకుమార్
-డిఎస్పీ సత్యానందం
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో దీపావళి బాణసంచా దుకాణాలు ఏర్పాటు, లైసెన్సులు తదితర అంశాలపై స్థానిక డిఎస్పీ ఎన్.సత్యానందం, పట్టణ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, స్థానిక దుకాణదారుల యజమానులతో అర్డీవో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ దీపావళి పండుగ వేడుకల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది దీపావళి బాణసంచా దుకాణాలను గుడివాడ బైపాస్ రోడ్ లో గల ఖాలీ స్థలంలో షాపులు ఏర్పాటు పర్మిషన్ ఇవ్వడం జరగిందన్నారు. ప్రతి దుకాణ యజమాని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నో మాస్క్ నో సేల్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. అగ్నిప్రమాదాలు నియంత్రణకు ఒక్కోక్క షాపు వద్ద 20 లీటర్ల నీరు, 12 ఇసుకబస్తాలు, ఫైర్ ఎగ్జిష్టర్స్ ను సిద్దంగా ఉంచాలన్నారు. బాణ సంచా దుకాణాలు ఏర్పాటుకు దరఖాస్తులను స్థానిక తాహశీల్దారు, అగ్నిమాపక అధికారులు పరిశీలించి ధృవీకరించిన తదుపరి ఆర్డీవో ఆయా షాపులకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. లైసెన్సు పొందిన దుకాణదారులు మాత్రమే బాణాసంచా విక్రయించాలన్నారు. ఇందుకు విరుద్దంగా ఎవరైనా షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపితే అటువంటి షాపులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పండుగ మూడు రోజులు రెవిన్యూ, అగ్నిమాపక, పోలీసు ఇతర శాఖల అధికారులు టీముగా ఏర్పడి పర్యవేక్షిస్తుండాలని సూచించారు. దుకాణాదారులు తాము విక్రయిస్తున్న షాపుల్లో నోస్మోకింగ్ , జేబు దొంగలున్నారు జాగ్రత్త, పోలీసు, అగ్నిమాపక కేంద్రాల సెల్ పోన్ నెంబర్ల గల ప్లెక్సీలను ప్రతి షాపు నందు ఏర్పాటు చేయాలని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులుకు ముందు క్రమంలో ప్రాధాన్యతనిచ్చి బాణసంచా విక్రయించాలని దుకాణదారులకు ఆదేశించారు. ప్రతి షాపులో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
డిఎస్పీఎన్.సత్యానందం మాట్లాడుతూ దీపావలి పండుగను జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు ఆనందంగా జరుపుకోవా లన్నారు. లైసెన్సులు లేకుండా షాపులను నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు టపాసుల వెలిగించేటపుడు పెద్దలు వారి వద్దనే ఉండాలని విజ్ఞప్తి చేసారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా బాణసంచా విక్రయించే ప్రాంతంలో నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. ఈసందర్బంగా బైపాస్ రోడ్ నందు గల ఖాలీ స్థలంలో దుకాణాల ఏర్పాటు చేయు ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు.
కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనుకుమార్, డిఎస్పీ ఎన్. సత్యానందం, తాసిల్దార్ శ్రీనివాసరావు, సీఐ లు గోవిందరాజులు, దుర్గారావు, డివిజన్ పరిధిలోని పలు మండలాల తాసిల్దార్ లు, ఫైర్, మరియు విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.