-త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు
-2024-25 నుంచి రాష్ట్రలో తగ్గుముఖం పట్టిన మలేరియా కేసులు
-రాబోయే వర్షాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే క్రిమిసంహారక మందు పిచికారీ
-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
-రేపు ప్రపంచ మలేరియా దినోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మలేరియా జ్వరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపబోతున్నామని ప్రకటించారు. 2024-25 నుంచి మలేరియా జ్వరాల కేసులు రాష్ట్రంలో తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. 2024-25లో 7,871 మలేరియ కేసులు రాగా, 2025-26లో 7,199 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు (16 వారాలు) 899 కేసులు నమోదైనట్లు చెప్పారు. కిందటేడాది ఇదే సమయంలో 1,783 కేసులు వచ్చాయన్నారు. 2030 నాటికి మలేరియా కేసులు గణనీయంగా తగ్గించేందుకు పకడ్బందీగా రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు చేడుతున్నామని తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం (శనివారం-ఏప్రిల్ 25) పురస్కరించుకుని మంత్రి నేడొక ప్రకటన జారీచేశారు.
వర్షాలు పురస్కరించుకుని దోమల వ్యాప్తి నిరోధక ‘స్ప్రే’ కార్యక్రమాలు
రాబోయే వర్షాలు దృష్టిలో ఉంచుకుని ‘ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే’ కార్యక్రమాన్ని చేబట్టబోతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇళ్లల్లోని గోడలు, పైకప్పు భాగంలో క్రిమి సంహర క మందును స్ప్రే చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వీలవుతుందని వెల్లడించారు. క్రిమిసంహారక మందు కొనుగోలు, పిచికారీ, ఇతర ఖర్చుల కింద కలిపి ఏడాదికి రూ.10 కోట్ల వరకు వ్యయం చేస్తున్నామని తెలిపారు. మలేరియా జ్వరాల కేసులు అధికంగా ఉండే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లో ‘స్ప్రే’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సదరు ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ‘స్ప్రే’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి చేపట్టామని తెలిపారు. ఇవి కాకుండా ఎంపికచేసిన మరో 13 జిల్లాల్లోనూ మే 15 నుంచి దశల వారీగా ప్రారంభించి, ఆగస్టు 30 నాటికి ‘స్ప్రే’ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మర్కాపురం, నంద్యాల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, ఏలూరు, మన్యం, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాలున్నాయి. ఈ స్ప్రే కార్యక్రమ నిర్వహణకు రూ.4.5 కోట్లు, పిచికారి మందు కొనుగోలు కోసం రూ.4.80 కోట్ల వరకు (అల్ఫా సైపర్ మెత్రిన్, మలాథియాన్ మందు ) ఖర్చు పెడుతున్నామన్నారు. ఇతర ఖర్చుల కింద కలిపి మొత్తం రూ. 10 కోట్ల వరకు వ్యయం చేస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రతి వెయ్యి జనాభాలో రెండు కేసులు నమోదైన గ్రామాల్లో ‘స్ప్రే’
ప్రతి వెయ్యి జనాభాలో రెండు కేసులు నమోదైన గ్రామాల్లో ఈ స్ప్రే కార్యక్రమాన్ని చేబడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే బాపట్ల, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో వరుసగా మూడేళ్ల నుంచి కేసులు నమోదుకాలేదని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారి ద్వారా మలేరియా కేసులు బయటపడ్డాయన్నారు. మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు పంపాల్సిన ప్రతిపాదనలు ఎలా ఉండాలి? ఎటువంటి ఆధారాలు సమర్పించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేనెల వెళ్లే ప్రతిపాదనలు అనుసరించి, కేంద్ర బృందం ఈ మూడు జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు. నిశిత పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వం ‘మలేరియా ఎలిమినేషన్’పై ప్రకటన చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 0.15 చొప్పున కేసులు వస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.46, పార్వతీపురం మన్యం జిల్లాలో 1.95 చొప్పున కేసులు ఉన్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో దోమల తెరల పంపిణీని ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు, పోలవరం, మన్యం జిల్లాల్లో పంపిణీ పూర్తయ్యే దశలో ఉందని పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా 1.95 లక్షల కుటుంబాలు, విద్యార్థుల వసతి గృ హాలకు అందచేసే 2.55 లక్షల దోమ తెరలను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మలేరియా జ్వరాలు, దాని ప్రభావం, తీసుకోవల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆసుపత్రుల్లో ఉన్న వైద్య సేవల వినియోగం తెలియచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Prajavartha Online Telugu News