అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముప్పుగా మారుతున్నాయని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా రాష్ట్ర పురోగతిని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. దళితులపై జరుగుతున్న హింసకు బాధ్యులైన వారిని రక్షించే విధంగా వైఎస్ఆర్సిపి వ్యవహరిస్తుందన్నారు. వైఎస్ఆర్సిపి కుల వివాదాలను రెచ్చగొట్టడం, హత్య రాజకీయాలను ప్రోత్సహించడం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే చర్యలకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రజలు వెల్లడించారన్నారు. ఇటీవల వీళ్ళ కరపత్రిక ప్రచురించిన కథనాల ద్వారా కాపు, కమ్మ వంటి కులాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు.
గోదావరి జిల్లాలు ఎప్పటినుంచో శాంతియుతంగా ఉన్నాయని, అక్కడ కుల వివాదాలను సృష్టించే ప్రయత్నాలను ప్రజలు సహించరని ఆయన స్పష్టం చేశారు. హత్య రాజకీయాలు వైఎస్ఆర్సిపి నాయకత్వానికి సహజంగా మారాయని విమర్శిస్తూ, ఇటీవల జరిగిన ఘటనలు కూడా అదే విషయాన్ని నిరూపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం, కొత్త పరిశ్రమల ఏర్పాటు వంటి కీలక కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రజలు మరింత కఠినమైన తీర్పు ఇస్తారని, వైసీపీకి వచ్చిన 11 సీట్లను ఒక సీటుకు పరిమితం చేసేలా నిర్ణయం తీసుకుంటారని సానా సతీష్ బాబు హెచ్చరించారు….
Prajavartha Online Telugu News