Breaking News

1.50 కోట్లతో పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిదిగా తన ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంపుల చెరువు హెడ్ వాటర్ వర్క్స్ నుండి శారదానగర్ లోని ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో రెండున్నర కిలోమీటర్ల దూరం కొనసాగే తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి పేర్ని నాని గురువారం ఉదయం 7 గంటల సమయంలో భూమిపూజ నిర్వహించి శంఖుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, స్థానిక శారదానగర్ ప్రాంతంలో మునిసిపల్ ట్యాంకర్ తో నీళ్లు సరఫరా మినహా కుళాయి ద్వారా నీళ్లు లభ్యం అయ్యేవి కావని ఎంతోకాలంగా తాగునీటి ఇక్కట్లు ఆ ప్రాంతంలో అత్యధికమని అన్నారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఓవర్ హెడ్ ట్యాంక్ శారదానగర్ లో మంజూరైందని పంపుల చెరువు నుంచి నాటి పైప్ లైన్ పాతది కావడం , వ్యాసార్థం చిన్నగా ఉండటం శారదానగర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ను తాగునీటితో నింపేందుకు అత్యధిక సమయం పడుతుందన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 45 కోట్ల రూపాయల తాగునీటి పథకంలో భాగంగా టైలర్స్ కాలనీ, ఖాలేఖాన్ పేట లలో నూతన ఓవర్ హెడ్ రిజర్వాయర్లు త్వరలో నిర్మాణం కానున్నాయని వాటిని సైతం నీటితో నింపడానికి , శారదా నగర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ను వేగంగా నింపడానికి ఈ రెండున్నర కిలోమీటర్ల ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం అత్యవసరమన్నారు. గత కొంతకాలంగా శారదానగర్ , టైలర్స్ కాలనీ, ఖాలేఖాన్ పేట , శివగంగ ప్రాంత ప్రజలు పడుతున్న తాగునీటి ఇబ్బంది తొలిగిపోనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి , పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు.
ఈ పైప్ లైన్ శంఖుస్థాపన కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), కార్పొరేటర్లు చిటికెన నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, షేక్ సాహెబ్, నాలి శారద, మచిలీపట్నం నగర పాలక సంస్థ కమీషనర్ శివరామకృష్ణ, డివిజన్ ఇంచార్జ్ లు బందెల థామస్ నోబుల్, నాలి మాధవ్, ఎం ఇ త్రినాధ్ రావు, ఏ ఇ వర ప్రసాద్, పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *