Breaking News

ఎన్నికలు ముగియగానే జనంపై గుదిబండ మోపిన మోడీ సర్కార్

-పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మోడీ సర్కార్ 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం రూ.993లు పెంచి, జనంపై గుదిబండ మోపడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వగానే కేంద్రంలోని మోడీ సర్కార్ ధరల బాదుడుకు సిద్ధమైంది. మోడీ ప్రభుత్వం పలు రాష్ట్రాల ఎన్నికల సమీపించే ముందు ప్రజల భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ; పోలింగ్ ముగియగానే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను భారీగా పెంచడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం 5 రాష్ట్రాలలో పోలింగ్ ముగిసిన వెంటనే వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ధరను రూ.993లు పెంచుతూ కేంద్రం షాక్ ఇవ్వడం దుర్మార్గం. ఈ భారీ పెంపు తర్వాత ఢిల్లీలో ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.3100కి పైగా చేరింది. ఇంధన ధరలు నిరంతరం పెరుగుతుండటం, ప్రస్తుత క్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన మోడీ ప్రభుత్వం వైఫల్యమవుతోంది. ఇటీవల పలు రాష్ట్రాలలో వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరతను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ధరలను స్థిరంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా, దాని బదులు భారాన్ని సాధారణ ప్రజలపై మోపుతోంది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా హోటళ్లు, ధాబాలు, హాస్టళ్లు, పిజి వసతులు మరియు చిన్న వ్యాపారాలపై వెంటనే ప్రభావం పడుతుంది. దీని ఫలితంగా ఆహార ధరలు పెరిగి జన జీవన వ్యయం మరింత భారమవుతుంది.
ఎన్నికల తర్వాత ఎల్‌పిజి గ్యాస్ మరియు ఇతర ఇంధన ధరలు పెరుగుతాయని సిపిఐ ముందే చేసిన హెచ్చరికలను నిజం చేస్తూ ఓటింగ్ ముగిసిన మరుసటి రోజే కేంద్రం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచేసింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయనే సాకుతో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంధన ధరలు పెంచితే ఆ భారం అన్ని రంగాలపై పడి, నిత్యావసర వస్తువలు పెరుగుదలతో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుంది. ప్రజల జీవనోపాధి కంటే ఎన్నికలలో తమ స్వలాభాలపైనే మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టిందనేది సత్యం. పోలింగ్ పూర్తయ్యాక సాధారణ ప్రజలపై భారాన్ని మోపడం అన్యాయం. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
దేశవ్యాప్తంగా పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని సిపిఐ స్పష్టం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *