-ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. దళితులను ఎంతగానో ఆదరిస్తూ వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉన్నతికి ఎంతగానో కృషిచేస్తున్న ప్రస్తుత ప్రభుత్వంపై బురదజల్లే విధంగా వార్తాంశాలు వ్రాయడం ఏమాత్రం తగదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తన ఆధీనంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖను మరొక మంత్రికి అప్పగించడం పై ఊహాజనితమైన కథనాన్ని ప్రచురించటాన్ని ఆయన ఖండించారు. వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే దళితులు అన్ని విధాలుగా అభివృద్ది చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అమలుచేసే నవరత్నాలు పథకాల ద్వారా ప్రతి ఒక్క దళితునికి ఇల్లు, ఇళ్ల స్థలం అందడంతో పాటు అమ్మఒడి, ఆంగ్లమాధ్యమం వంటి పలు పథకాల వల్ల లబ్దిచేకూరటంతో పాటు వారి పిల్లలను ఉన్నతంగా చదివించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జి.ఎస్.టి. అమల్లోకి వచ్చిన తదుపరి వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక మంత్రి ఆదీనంలోనే ఉండాల్సిన అవసరం దృష్ట్యా ఆ శాఖను ఆర్థిక శాఖకు బదలాయించడం జరిగిందని, పలు రాష్ట్రాలు ఇదే దిశలో అడుగులు వేస్తున్నాయన్నారు. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఇటు వంటి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తన ఆదీనంలో ఉన్న శాఖను మరొక మంత్రికి అప్పగించడంపై తనకు ఏమాత్రం బాధలేదని ఆయన తెలియజేశారు.