-సాంకేతికతను సద్వినియెగం చేసుకుంటూ ‘టెలిమెడిసిన్’ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి
-రోగులతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా మెలగాలి – వైద్యులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన
-వైద్య సేవలు ఆర్ధికంగా అందరికీ అందుబాటులోకి చర్యలు తీసుకోవాలి
-కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచన
-మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
-నాయకత్వమంటే రాజకీయాలే కాదు, మీ రంగంలో నలుగురినీ ముందుకు నడపడం
-విజయవాడలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించి, వైద్య విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్యరంగంలో నెలకొన్న మానవవనరుల కొరతను వీలైనంత త్వరగా అధిగమించడంపై దృష్టిసారించడం తక్షణ అవసరమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వైద్యరంగంలోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో మౌలికవసతులను మెరుగుపరుచుకోవడం, వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి గుర్తుచేసిందని ఉపరాష్ట్రపతి అన్నారు.
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఆక్సిజన్ ప్లాంట్ ను ఇతర సదుపాయాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, అనంతరం వైద్య విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యులు, రోగుల నిష్పత్తి విషయంలో భారతదేశంలో చాలా అంతరం ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. 2024 నాటికి డబ్ల్యూహెచ్‌వో సూచించినట్లుగా ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక వైద్యుడు ఉండే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ వైద్య మౌలిక వసతుల మిషన్ ద్వారా గ్రామాల నుంచి పట్టణాల వరకు అత్యవసర వైద్యసేవలకోసం జరుగుతున్న ఏర్పాట్లు వచ్చే 4-5 ఏళ్లలో పూర్తవుతుండటం శుభపరిణామమన్నారు.
వైద్య రంగం వాణిజ్యపరమైన అంశంగా మారుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్సనందించే విషయంలో కాస్త మానవీయ దృక్కోణంలో ఆలోచించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వైద్య వృత్తి పవిత్రమైనదని, ఈ వృత్తి పవిత్రతతను కాపాడటంలో తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు, ఉన్నతస్థాయి విలువలను కాపాడటంలో వైద్యవిద్యార్థులు భాగస్వాములు కావాలి అని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైద్యులకు తొలి ప్రమోషన్ కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైద్యులు గ్రామీణప్రాంతాలకు వచ్చేలా.. ఆ ప్రాంతాల్లో కనీస నివాస సదుపాయాల కల్పన కూడా అవసరమన్నారు.
ఐటీ రంగంలో భారతదేశం సాధిస్తున్న సాంకేతిక ప్రగతిని సద్వినియోగం చేసుకోవాల్సిన విషయాన్నీ ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాలు (పీపీపీ) పెరగాల్సిన అవసరముందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను మెరుగుపరిచేందుకు ‘టెలిమెడిసిన్’అనుసంధానతను పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. టెలిమెడిసిన్ ద్వారా వైద్య ఖర్చులు తగ్గడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వారికి కనీస వైద్యసేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. ఆరోగ్య బీమా కోసం ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’, ఇతర కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు.
వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న ఉపరాష్ట్రపతి, అందరికీ ఆర్థికంగా అందుబాటులోకి వైద్యసంరక్షణను తీసుకురావడంపై దృష్టిసారించాలన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రైవేటు రంగం కూడా తోడ్పాటునందించాలన్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను ఉదహరిస్తూ.. భవిష్యత్తులో ఎదురయ్యే ఏ విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు వైద్యులు, వైద్యరంగం సంసిద్ధంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, వారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ముందు వరుస పోరాట యోధులుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. దీంతోపాటుగా కరోనా టీకా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 105 కోట్ల మందికి అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నం అభినందనీయమన్నారు.
కరోనానంతరం ఆర్థిక కార్యలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుండటంపై హర్షం వ్యక్తం చేసిన ఉఫరాష్ట్రపతి, కరోనా సంపూర్ణంగా నియంత్రణలోకి వచ్చేంతవరకు ప్రభుత్వాలు సూచించినట్లుగా జాగ్రత్తలు పాటించడం విషయంలో అలసత్వం వహించకూడదన్నారు. ఇటీవలి కాలంలో అసంక్రమిత వ్యాధుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, యోగా, ధ్యానాన్ని అలవర్చుకోవడం అత్యంత అవసరమని ఆయన సూచించారు.
విజయవాడ నగరమంటే తనకెంతో ఇష్టమన్న ఆయన.. నగరంతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా మాతృభాష ప్రాధాన్యతను వివరించిన ఉపరాష్ట్రపతి, మన సంస్కృతి భాషతో పెనవేసుకుపోయిందని, భాషా సంస్కృతులను మరచిన నాడు మన మనుగడే ప్రశ్నార్ధకమౌతుందని తెలిపారు. నాయకత్వ లక్షణాల గురించి తెలియజేసిన ఉపారాష్ట్రపతి, చాలా మంది నాయకత్వమంటే రాజకీయాల గురించే ఆలోచిస్తారని, తమ తమ రంగాల్లో నలుగురినీ ముందుకు నడిపే ఎవరైనా నాయకుడేనని తెలిపారు. విషయపరిజ్ఞానం, లక్ష్యం, క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడి పనిచేసే తత్వంతో ఎవరైనా నాయకులుగా ఎదగవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీ, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కామినేనిశ్రీనివాస్, సిద్ధార్ధ అకాడమీ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, డీజీ డా. సి. నాగేశ్వరరావు, కార్యదర్శి డా. పి. లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డా. పి.ఎస్.ఎన్. మూర్తి, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.