-సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వహించాలి
-జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో ప్రభుత్వాల ద్వారా రుణాలు పొంది గృహాలను నిర్మించుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న ఒన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ను సద్వినియోగం చేసుకొనే విదంగా లబ్దిదారులకు అ వగాహన కల్పించాలని జాయింట్ కలెక్టరు (హౌసింగ్) శ్రీ వాసు నుపూర్ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ 1983 నుంచి ప్రభుత్వ రుణ సహాయంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులు గుర్తించాలన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారు ఎంత తీసుకున్నా సరే వారితో రూ .10 వేల నగదును వారి పరిధిలో గల సచివాలయాల్లో జమ చేయాలన్నారు. అనంతరం వారి పేరున రిజిష్టరు చేయడం జరుగుతుందన్నారు. గుర్తించిన లబ్దిదారులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం గుడివాడ పురపాలక సంఘ పరిధిలో గల 5,6,7 వార్డుల్లో గల సచివాయాలను ఆకస్మిక తనిఖీ చేసి ప్రభుత్వం పథకాలపై అమలు చేస్తున్న వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు నిర్వహిస్తున్న రికార్డులను, రిజిష్టర్లు పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో లబ్దిదారులకు చేరువ అయ్యేలా బాధ్యతా యుతంగా సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనుకుమార్, హౌసింగ్ డీఇ రామోజీ నాయక్, మండల తాహశీల్థార్లు, యంపీడీవోలు, ఏవో స్వామినాయుడు, మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.