-ఒక దేశ వైభవాన్ని, ఆ దేశ సాహిత్యం ప్రతిబింబిస్తుంది
-సమాజ హితాన్ని ఆకాంక్షించే విధంగా సాహిత్య సృష్టి జరగాలి
-మన సంస్కృతిని ముందు తరాలకు అందజేసే బలమైన వారధి మాతృభాషే
-తెలుగు మాత్రమే కాదు, ప్రతి మాతృభాషను కాపాడాలనేదే నా ఆకాంక్ష
-లిపి కూడా లేని కోయభాషలో బోధన దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రయత్నం అభినందనీయం
-పిల్లలకు మాతృభాషను చేరవేసే ఉత్తమ పద్ధతులు అన్వేషించాలి
-పిల్లలకు అమ్మభాష వెలుగులు పంచే క్రమంలో వారి స్థాయికి ఎదిగి ఆలోచించాలి
-విశాఖ సాహితీ స్వర్ణోత్సవ సంచికను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ హితాన్ని కాంక్షించే ఉత్తమమైన సాహిత్యమే తరతరాలు నిలిచి ఉంటుందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. అందుకే రామాయణ, భారత, భాగవతాలు నేటికీ స్ఫూర్తిని పంచుతూనే ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నానికి చెందిన సాహిత్య సంస్థ “విశాఖ సాహితీ” స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రవిశ్వకళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలోని డా. వై.వి.ఎస్. మూర్తి ఆడిటోరియంలో విశాఖ సాహితీ స్వర్ణోత్సవ సంచికను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. తాను ఎంతగానో అభిమానించే విశాఖ నగరంలో, మరింత అభిమానించే తెలుగు సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్న ఆయన, కళలకు కాణాచి అయిన విశాఖ నగరంలో 50 సంవత్సరాలుగా సంస్కృతి, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న విశాఖ సాహితీకి అభినందనలు తెలిపారు.
ఒక దేశ వైభవానికి, పరిణితికి ఆ దేశ సాహిత్యమే ప్రతిబింబమన్న ఉపరాష్ట్రపతి, కవులు, రచయితలు, మేధావులు, విలేకరులు రాసే ప్రతి అక్షరంలోనూ సమాజ హితం ప్రతిబింబించాలని తెలిపారు. అందుకే భారత దేశాన్ని రామాయణ భూమిగా, వాల్మీకి భూమిగా పాశ్చాత్య రచయితలు సైతం అభివర్ణించారని తెలిపారు. సమాజ హితంతో కూడిన అక్షరాలే నిజమైన సాహిత్యమన్న ఉపరాష్ట్రపతి, ఏది హితం.. ఎవరికి హితం అనేది దేశాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, సమాజం చెందే పరిణామాన్ని బట్టి మారుతుందని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా సాహిత్యంలో కూడా మార్పులు రావాలన్న ఆయన, ఇందు కోసం రచయితల చొరవ మరింత పెరగాలని సూచించారు. ముఖ్యంగా మన సంస్కృతిని ప్రతిబింబించే జానపద సాహిత్యాన్ని నిలబెట్టుకోగలిగితే, మన సంస్కృతిని కాపాడుకున్నట్లేనని తెలిపారు.
తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనదన్న ఉపరాష్ట్రపతి, పటిష్టమైన భాషా సంపద, పుష్కలమైన సాహిత్య సంపద కలిగిన తెలుగు… మన మాతృభాష కావడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ఎన్నో సాహితీ ప్రక్రియలు ఈ నేల వైభవాన్ని చాటిచెబుతున్నాయన్న ఆయన, వాటి ద్వారా మన సంస్కృతి ముందు తరాలకు అందుతుందని తెలిపారు. వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, పండుగలు, అచార వ్యవహారాలు, వృత్తులు… ఇలా ప్రతి అంశాన్ని సాహిత్యం ప్రతిబింబిస్తుందన్న ఆయన, ఘనమైన సాహితీ సంపద ఉన్న తెలుగు భాషను పరిరక్షించుకుని, ముందుతరాలకు అందజేసినప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలు మనుగడ సాగించి, భవిష్యత్ తరాలను మేలైన మార్గంలో ముందుకు నడుపుతాయని సూచించారు.
తెలుగు భాష అభివృద్ధిని మాత్రమే తాను కోరుకోవడం లేదన్న ఉపరాష్ట్రపతి, అన్ని మాతృభాషలు తమ మనుగడను నిలబెట్టుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని 8 జిల్లాల్లో ఉన్న 920 పాఠశాలల్లో కోయ భాషలో ప్రాథమిక విద్యాబోధన చేస్తున్నారని తెలి ఎందో ఆనందించానన్న ఆయన, ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపానని, తెలుగు లిపి ద్వారా కోయ భాషను సంరక్షించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల చొరవను కచ్చితంగా అభినందించి తీరాల్సిందేని తెలిపారు. మాతృభాషను మాత్రమే నేర్చుకోమని తాను చెప్పడం లేదన్న ఉపరాష్ట్రపతి, మిగతా భాషలు నేర్చుకునే ముందు మాతృభాషలో నైపుణ్యం సాధించాలని సూచించారు. ఇందు కోసం తల్లిదండ్రుల చొరవ మరింత పెరగాలని ఆకాంక్షించారు.
మాతృభాషలోని మాధుర్యాన్ని పిల్లలకు పంచడం ద్వారానే సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమౌతుందన్న ఉపరాష్ట్రపతి, పిల్లల సాహిత్యం మీద రచయితలు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పిల్లలకు తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని అలవాటు చేసే విధంగా నూతన మార్గాల అన్వేషణ సాగాలన్న ఆయన, ఇలాంటి కార్యక్రమాలను ఓ పనిలాగా కాకుండా… ఆటపాటలతో సమానంగా పిల్లలకు అలవాటు చేయగలగాలన్నారు. శ్రీ చింతా దీక్షితులు, శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ లాంటి వారు ప్రత్యేకంగా పిల్లల కోసమే అందించిన సాహిత్యం గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, పిల్లలకు మన భాషలోని మాధుర్యాన్ని అందించేందుకు వారి స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని సూచించారు.
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని గడపగడపకూ చేరే వేసే ఆశయంతో 50 ఏళ్ళ క్రితం ప్రారంభమైన విశాఖ సాహితీ సేవలను అభినందించిన ఉపరాష్ట్రపతి, 1000కి పైగా సభలు నిర్వహించారని తెలిసి ఆనందం వ్యక్తం చేశారు. 1971లో విశాఖ సాహితీ ఉద్భవించిన నాటి నుంచి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తెలుగు భాషా, సాహిత్య వారసత్వాన్ని సంరక్షించుకుంటున్న తీరు… ఔత్సాహిక రచయితలను ప్రోత్సహిస్తున్న తీరు… ముఖ్యంగా రచయిత్రులను ప్రోత్సహిస్తున్న తీరు… చర్చాగోష్ఠులు, ప్రచురణలతో సాహిత్యాన్ని ముందు తరాలకు అందజేస్తున్న తీరు ఆనందదాకయమని తెలిపారు. విశాఖ సాహితీ సంస్థలకు చెందిన సభ్యులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకోవడం, సినిమా రంగంలో రచయితలు, నటులుగా స్థిరపడడం ముదావహమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రవిశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి, విశాఖ సాహితీ అధ్యక్షురాలు ఆచార్య కోలవెన్ను మలయవాసిని, ఉపాధ్యక్షురాలు డా. కందాళ కనకమహాలక్ష్మి, కార్యదర్శి ఘండికోట విశ్వనాధం సహా పలువురు విశ్వవిద్యాలయ ఆచార్యులు, సాహితీవేత్తలు, రచయితలు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.