కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత గృహ, భూహక్కు పథకం “ఒన్ టైం సెటిల్‌మెంట్” పై ప్రజల్లో అవగాహన కలిగించి, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చెయ్యాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు ఆదివారం ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలో ఇంకా 31,222 మంది లబ్ధిదారుల డేటా సేకరించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నుంచి1983 – 2011 సంవత్సరాల మధ్య గృహనిర్మాణానికి రుణాన్ని తీసుకొన్న వ్యక్తుల కోసం రూపొందించిన ఒన్ టైం సెటిల్‌మెంట్ పథకమే జగనన్న శాశ్వత గృహ భూహక్కు పథకం అని ఆర్డీవో మల్లిబాబు అన్నారు. ఈ పథకాల కింద ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుని వాటాగా లబ్దిదారులకు రుణాలను మంజూరు చేసిందని, రుణాన్ని గడువులోగా చెల్లించలేని లబ్దిదారులకు ఆయా రుణాలను మాఫీ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒన్ టైం సెటిల్ మెంట్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో 78,364 మంది లబ్దిదారుల్లో 38,220 (55 శాతం ) మంది డేటా అప్ లోడ్ చెయ్యడం జరిగిందన్నారు. ఇంకా 31,222 మంది వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే 8,922 ల మంది లబ్ధిదారులు పేరున గతంలోనే రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి , ఈ పధకం యొక్క ప్రయోజనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి అవగాహన కలుగచేసే గురుతరమైన బాధ్యత మనపై ఉందన్నారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ పధకం ప్రయోజనం ప్రజలకు చేరువ చెయ్యాల్సి ఉందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.నెంబరు 82 లో పేర్కొన్న ఇళ్లు మంజూరైన లబ్దిదారుడు గ్రామీణ మునిసిపాలిటీ, నగర ప్రాంతాల్లో గృహాన్ని నిర్మిస్తే నిర్ణిత రుసుము ను ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ గా చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశించిన ఈ మొత్తాన్ని నవంబరు 7 నుంచి డిసెంబరు 15వ తేదీల మధ్య చెల్లించడం ద్వారా రెవిన్యూ అధికారులు లబ్దిదారులకు వారి ఇంటి స్థలాలను డిసెంబరు 21వ తేదీన సంబంధిత లబ్దిదారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేసి రిజిష్టరు చేసిన పట్టా అందజేస్తారన్నారు. లబ్దిదారులు గృహనిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన బకాయి మొత్తం అసలు, వడ్డీతో కలుపుకొని పైన నిర్దేశించిన కనీస మొత్తం కంటే తక్కువగా ఉన్నట్లయితే బకాయిపడి వున్న మొత్తాన్ని చెల్లించి ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చునని మల్లిబాబు తెలిపారు. గృహనిర్మాణ లబ్దిదారుల గృహాలను వలంటీర్లు సందర్శించి, డిమాండ్ నోటీసు జారీ చేస్తారు, పేర్కొన్న మొత్తాన్ని సంబంధిత లబ్దిదారుడు తమ సమీప సచివాలయంలో గాని, వాలంటీరు ద్వారా గాని చెల్లించవచ్చునని పేర్కొన్నారు. ఈ పథకం వినియోగించుకోడానికి అర్హత ఉందో లేదో వాలంటీర్ తెలుపుతారని, ఒన్ టైం సెటిల్‌మెంట్ కింద లబ్దిదారులకు అవకాశం కల్పించే స్వచ్ఛంద పథకం అన్నారు. లబ్దిదారుడు మరణించిన తర్వాత అతని కుటుంబ వారసులు లీగల్ హయర్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్ వంటి అధీకృత ధ్రువపత్రాలు సమర్పించడం ద్వారా ఈ పథకము ప్రయోజనం పొందవచ్చు నన్నారు.
Tags kovvuru
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …