-వాతావరణ కాలుష్యమే నిమోనియాకు ప్రధాన కారణం
-చిన్నపిల్లలు, వయోవృద్ధులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి
-వరల్డ్ నిమోనియా డే కార్యక్రమంలో ‘హరిణి’ పలమనాలజిస్టుల బృందం
-హరిణి హాస్పిటల్స్ నందు రెండు రోజులు ఉచిత వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హరిణి హాస్పిటల్స్ పలమనాలజిస్టులు పేర్కొన్నారు. ఈనెల 12న వరల్డ్ నిమోనియా డే పురస్కరించుకుని హరిణి హాస్పిటల్స్ నందు ఉచిత కన్సల్టేషన్ సేవలను అందిస్తున్నట్లు ప్రకటించారు. నగరంలోని మేనర్ ఫుడ్ ప్లాజాలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హరిణి పలమనాలజిస్టులు డాక్టర్ ఎస్.వి.శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఎన్.అనూష, డాక్టర్ పిన్నమనేని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మానవ శరీర అవాయువాల్లో అత్యధికంగా ఇన్ఫెక్షన్ కు గురయ్యేవి ఊపిరితిత్తులేనని, నిమోనియా కారణంగా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. నిమోనియా వ్యాధికి వాతావరణ కాలుష్యం ప్రధాన కారణంగా నిలుస్తోందని అన్నారు. కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం, ఫేస్ మాస్కులు ధరించడం ద్వారా నిమోనియా బారినపడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. చిన్నపిల్లలు, 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారికి నిమోనియా ప్రమాదం అధికంగా ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా నిమోనియా నుంచి రక్షణ పొందవచ్చని, చిన్నపిల్లలు, వయోవృద్ధులు తప్పనిసరిగా ఇన్ఫ్లుయెంజా, నిమోకోకల్, ఫ్లూ వ్యాక్సిన్లను వేయించుకోవాలని అన్నారు. ఈ ఏడాది నిమోనియా డేను “ఎవ్రి బ్రీత్ కౌంట్స్” అనే నినాదంతో జరుపుకుంటున్నామని చెప్పారు. నిమోనియా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరించారు. నిమోనియా లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రతరం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన హరిణి హాస్పిటల్స్ లోని పలమనాలజీ విభాగం నందు అత్యంత అనుభవజ్ఞులైన క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇంటర్వెన్షనల్ పలమనాలజిస్ట్, పీడియాట్రిక్ పలమనాలజిస్ట్, అలెర్జీ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని అన్నారు. బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఫారిన్ బాడీ రిమూవల్, రిజిడ్ బ్రాంకోస్కోపీ, అడ్వాన్స్డ్ క్రయో టెక్నాలజీలతో పాటు రెండు బ్రాంకోస్కోపీ సూట్ రూంలు, అడ్వాన్స్డ్ స్లీప్ ల్యాబ్ సదుపాయాలతో హరిణి పలమనాలజీ విభాగం అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తోందని పేర్కొన్నారు. వరల్డ్ నిమోనియా డే సందర్భంగా హరిణి హాస్పిటల్స్ నందు రెండు రోజుల పాటు ఉచిత కన్సల్టేషన్ సదుపాయాన్ని అందిస్తున్నామని, వైద్య పరీక్షలపై 25 శాతం రాయితీ ఇవ్వబడుతుందని వెల్లడించారు. ముందుగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్.వి.శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఎన్.అనూష, డాక్టర్ పిన్నమనేని పవన్ కల్యాణ్ కోరారు.