– అనంతపురం ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..
– అనంతపురం పోలీసు అధికారులకు వాసిరెడ్డి పద్మ ఆదేశాలు
– ‘దిశ’ యాప్ వినియోగంతో వేధింపుల నియంత్రణకు పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం జిల్లా గుంతకల్లులో కన్నతండ్రే కూతురిపై లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ గా స్పందించారు. గురువారం ఆమె ఈ ఘటనపై ఆరాతీసి అనంతపురం పోలీసు దర్యాప్తు అధికారితో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై పోక్సోకు మించిన చట్టాలతో కఠినచర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ స్ర్తీ హింస వ్యతిరేక దినోత్సవం రోజే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం విచారకరమన్నారు.ఇంట్లోనే రక్షణలేని పరిస్థితిని…పరిచయస్తులే లైంగికదాడికి పాల్పడటాన్ని సమాజం ఈసడించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా భద్రతకు సంబంధించి అత్యున్నత స్థాయి నిర్ణయాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళా భద్రత కోసం రూపొందించిన’ దిశ ‘యాప్ వినియోగంపై అందరూ ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.ఇళ్లల్లో చెప్పుకోలేని వేధింపుల నుంచి కూడా ‘దిశ’ యాప్ వినియోగంతో రక్షణ పొందవచ్చని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లు, గ్రామైక్య సంఘాల మహిళలతో బాధితులు తమ కష్టాలను చెప్పుకునే వాతావరణం రావాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.