విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీశ తెలిపారు.
ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం సవరించిన షెడ్యూల్‌లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల నోటీసుల దశ, వాటి పరిష్కార ప్రక్రియ జూలై 31,2026 నుంచి అక్టోబర్ 10,2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 16, 2026న ప్రచురించబడుతుందని పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్‌కు సంబంధించి జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి సమాచారం అందించి, ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా సవరించిన షెడ్యూల్‌ను లిఖితపూర్వకంగా తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు అవసరమైతే నిర్ణీత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీశ ప్రజలకు సూచించారు.
Prajavartha Online Telugu News