-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
-గూడవల్లి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ‘స్వచ్ఛ ఆంధ్ర’చైర్మన్, డైరెక్టర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని గూడవల్లి గ్రామంలో పట్టాభిరామ్, కార్పోరేషన్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కలిసి గురువారం పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. రోడ్లు శుభ్రం చేశారు. ‘స్వచ్ఛత హీ సేవ’లో భాగంగా ‘‘అందరం కలిసి ఒక రోజు, ఒక గంట (ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్)’’అనే పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా స్వయంగా కొడవళ్లతో తుప్పలను తొలగించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను, ఐఈసీ(ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యునికేషన్) వాల్ పెయింటింగ్స్‌ను, జేసీబీతో జరుగుతున్న పనులను, స్వచ్ఛరథాన్ని పరిశీలించారు. మట్టితో చేసిన గ్లాసులు, వాటర్ బాటిళ్లు, చెక్క స్పూన్ లు, పేపర్ గ్లాసులు వంటి బయోడీగ్రేడబుల్, డిస్పోజబుల్ వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి, వారికి స్వీట్ బాక్స్ లు ఇచ్చి, పారితోషికాలు అందజేశారు. ఏఎన్ఎంలు వారికి వైద్య పరీక్షలు చేశారు. అలాగే, గ్రామ పంచాయతీలో వ్యర్థాల విభజనను ప్రోత్సహించిన స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ధృవీకరణ పత్రాలను అందజేశారు.
కళాశాల విద్యార్థులకు పారిశుద్ధ్యం, 4 రకాలుగా వ్యర్థాల విభజనపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానివేయాలన్నారు. వాటి స్థానంలో పర్యావరణానికి హాని కలిగించని బయోడీగ్రేడబుల్, డిస్పోజబుల్ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. స్వచ్ఛత కోసం మనమంతా కలిసి ఒక అడుగు ముందుకు వేద్దాం అన్నారు.
పరిశుభ్రమైన సమాజానికి మన వంతు సహకారం అందిద్దాం, పరిశుభ్రతను పాటిద్దాం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం అని పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్లు చిన్ని శ్రీనివాసరావు, రవి కుమార్, ఆరుద్ర భూలక్ష్మి, లక్ష్మణరావు బొమ్మినేని, ఎం.నాగలక్ష్మి, ఎన్.పర్వీన్ భాను, నాగమణి బోలెం, పరుచూరి భవానీ రవికుమార్, రాము బుచ్చా, రెడ్డివారి మంజునాథ్, సానారెడ్డి కల్పనారెడ్డి, ఉదయ భాస్కర్ కూచిపూడి, పట్టాభిరామయ్య సాలాది, మువ్వల వెంకట రమణ, కార్పోరేషన్ ఈడీలు ఊర్మిళాదేవి, అర్జునరావు, ఎఫ్ఎం విజయశేఖర్, ఎన్టీఆర్ జిల్లా పరిషత్ సీఈఓ డాక్టర్ జె.అరుణ్, డిప్యూటీ సీఈఓలు కె.ఆనంద్ బాబు, కె.అనురాధ, డీజీపీఓ టి.సీతామహాలక్ష్మి, విజయవాడ డీడీఓ పి.వెంకట లక్ష్మి, డీఎల్పీఓ జీఎల్ఎన్వీ రాఘవన్, విజయవాడ గ్రామీణ ఎంపీడీఓ కె.పార్థసారధి, డిప్యూటీ ఎంపీడీఓ ఎం.దుర్గా వరప్రసాద్, గూడవల్లి పీడీఓ యు.భార్గవ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News