-డిస్కాములకు ఏపీఈఆర్సి సూచన
-ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ పై అధ్యయనం చేయండి.
-ఇంధన సామర్ధ్య గృహోపకరణాల వినియోగం వల్ల విద్యుత్ వినియోగం, బిల్లులలో తగ్గుదల
-వినియోగదారుల ప్రయోజనాల పై ఏపీఈఆర్సి ప్రత్యేక దృష్టి — ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సివీ నాగార్జున రెడ్డి
-డిస్కాములు , వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యం సాధిస్తాం
-ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు పై దృష్టి పెట్టండి — ఏపీఈఆర్సి సూచన
-ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలుతో రాష్ట్రం లో ఇంధన భద్రత , పర్యావరణానికి మేలు
-వినియోగదారులకు నాణ్యమైన 24x 7 విద్యుత్ సరఫరా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్టంలోని ప్రతీ విద్యుత్ వినియోగదారుడు ఇంధన సామర్థ్యం కలిగిన ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు వినియోగించేందుకు అవసరమైన అంశాల పై అధ్యయనం చేయాల్సిందిగా ఏపీ డిస్కాములను ఏపీ విద్యుత్ నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్సి) ఆదేశించింది. ఆధునిక ఇంధన సామర్ధ్య సాంకేతిక ప్రయోజనాలను రాష్ట్రం లోని ప్రతి కుటంబానికి అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఏపీఈఆర్సి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్రానికి సరిపడే విధానానికి రూపకల్పన చేయాల్సిందిగా సూచించింది.
ప్రతి విద్యుత్ వినియోగదారుడు తమ గృహాలలో ఇంధన సామర్థ్యం కలిగిన ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు వినియోగించేలా ప్రోత్సహించాలని డిస్కాములకు ఏపీఈఆర్సి సూచించింది. ఇటువంటి గ్రుహోపకారణాలు వాడటం వల్ల విద్యుత్ ను పొదుపు చేయవచ్చునని తద్వారా నెలవారి విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, పర్యావరణం పై పడే ప్రతికూల ప్రభావాలను కూడా నివారించేందుకు ఇవి దోహదపడతాయని ఏపీఈఆర్సి పేర్కొంది.
జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా ఏపీఈఆర్సి కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో , సంస్థ చైర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి మాట్లాడారు. ప్రతీ వినియోగదారునికి ఇంధన పరిరక్షణ , ఇంధన సామర్థ్యం పై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. తద్వారా ప్రతి వినియోగదారుడు తన బాధ్యతగా కొంత విద్యుత్ ను ఆదా చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఇంధన పొదుపు అనేది ఒక జీవన శైలిగా మారాలన్నారు. “ఒకరు ఒక యూనిట్ ఉత్పత్తి చేయలేకపోవచ్చు కానీ .. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం ద్వారా ఒక యూనిట్ పొదుపు చేయగలరు. ఒక యూనిట్ విద్యుత్ పోదుపు చేస్తే రెండు యూనిట్లు విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లే”. ఈ విషయాన్ని ప్రతీ వినియోగదారునికి అర్ధమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. దీన్నీ ఒక సామజిక బాధ్యతగా ప్రతి ఒకరు గుర్తెరగాలని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్ర స్థాయిలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేయటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని ఇంధన దిగుమతుల పై ఆధారపడే అవసరం కొంత మేర తగ్గుతుందని ఆర్థిక వ్యవస్థ పై ఇంధన భారం కొంత మేర నివారించవచ్చునని కాలుష్య కారక ఇంధనాల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. అలాగే ఇంధన ఆదా వల్ల వ్యక్తిగత స్థాయిలో వినియోగదారులు విద్యుత్ బిల్లులను కూడా తగ్గించుకోగలుగుతారన్నారు. విద్యుత్ సంస్థలకు సంబంధించి స్మార్ట్ గ్రిడ్ల పై పడే అధిక లోడు కూడా కొంత మేర నివారించవచ్చు.
ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతన్న ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ అనుసరించి విద్యుత్ వినియోగదారులకు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అందచేసే మార్గాలను పరిశీలించాలని ఏపీఈఆర్సి డిస్కాములకు సూచించింది. దీనిలో భాగంగా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు, ఎనర్జీ ఎఫిసిఎన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్ ) ,వస్తు ఉత్పత్తి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది . వాటి సహకారంతో వినియోగదారులకు ఇంధన సామర్థ్యం కలిగిన ఆధునిక గృహోపకారణాలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే వినియోగదారులు తమ నెల వారి విద్యుత్ బిల్లుల ద్వారా సదరు వస్తువులకు తిరిగి చెల్లింపులు చేయవల్సిఉంటుంది. ఈ గృహోపకరణాల వల్ల విద్యుత్ బిల్లులు కొంత మేర ఆదా అవుతాయి కాబట్టి వినియోగదారుల పై అంతగా భారం పడదు.
అయితే ఇంధన సామర్ధ్య గృహోపకరణాలు ఉపయోగించడం అనేది వినియోగదారులు స్వచ్చందంగా తీసుకోవాల్సిన నిర్ణయంగా ఉండాలి . వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే వారికి ఈ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందులో డిస్కాములు కేవలం ఫెసిలిటేటర్ పాత్ర మాత్రమే పోషిస్తుంది. వినియోగదారుల గృహోపకరణాల కోసం తీసుకున్న అప్పుతో గాని చెల్లింపుల విషయంలో గాని డిస్కాములకు ఎలాంటి సంబంధం ఉండదు..
పేద , దిగువ, మధ్యతరగతి వినియోగదారులు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కొనుగోలు చేయడం వారికి భారంగా ఉండే దృష్ట్యా ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ ను పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని ఏపీఈఆర్సి అభిప్రాయపడింది. దీని పై మూడు వారాలలోపు డిస్కాములు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయాల్సిందిగా ఏపీఈఆర్సి కోరింది.
విద్యుత్ రంగంలో వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఏపీఈఆర్సి కట్టుబడి ఉందని జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో డిస్కాములు , వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యం సాధించడం కూడా తమ బాధ్యత అని కమిషన్ మెంబర్లు రాజగోపాల రెడ్డి , ఠాకూర్ రామ సింగ్ లు కూడా స్పష్టం చేసారు.
వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన చౌక విద్యుత్ను అందచేయడం వల్ల వ్యవసాయ , పారిశ్రామిక, ఆర్థిక రంగాలలో రాష్ట్రం మంచి పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు . ఇందుకోసం ఏపీఈఆర్సి , విద్యుత్ సంస్థలు కలిసి పనిచేయటం ద్వారా భవిష్యత్ సవాళ్ళను అధిగమించే అవకాశం ఉందన్నారు . అలాగే రాష్ట్రం లో విద్యుత్ రంగం యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరచటం పై కమిషన్ దృష్టి పెట్టిందన్నారు. వినియోగదారులకు 24 X 7 నాణ్యమైన విద్యుత్ను , నాణ్యమైన సేవలను అందించవచ్చునని తద్వారా విద్యుత్ రంగం బలోపేతమవుతుందని జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు .
అలాగే ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను ప్రోత్సహిచడం పై విద్యుత్ సంస్థలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. తద్వారా రాష్ట్రంలో ఇంధన భద్రతను సాదించేందుకు , ఆర్థిక వ్యవస్థ పై ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఎనర్జీ ఎఫిసిఎన్సీ దోహద పడుతుందన్నారు.