విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో 73 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర గనులు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి చెప్పారు. గురువారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, డిప్యూడి నగర మేయర్ శైలజలతో కలిసి శుంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకదృష్టి పెట్టామన్నారు. విజయవాడ నగర మౌలిక సదుపాయల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారన్నారు. ఆ నిధులను ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందన్నారు. ఇచ్చిన హామీలు చాలవరకు నెరవేర్చారని, మిగిలినవి సైతం త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తరువాత నగర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. కృష్ణానదికి వచ్చే వరదల వల్ల నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురి అయ్యేవారన్నారు. వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నివాసమున్న వారందరిని తరలించడం పెద్ద ప్రహసనంగా ఉండేదన్నారు. ఆ స్థితి నుంచి ప్రజలను కాపాడాలన్న ధ్యేయంతో ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో రీటైనింగ్ వాల్ నిర్మిస్తుందన్నారు. గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిని విస్మరించి అమరావతి పైనే దృష్టి పెట్టిందన్నారు. నగరంలో శిలాపలకాలు వేసి అభివృద్ధి చూపిందన్నారు.
శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుందన్నారు. రెండు కమీటి హాళ్లు, రెండు విద్యుత్ స్టేషన్‌లు, సిసి రోడ్లు, రజక కళ్యాణమండపం నిర్మాణాలు ఇందులో భాగంగానే నిర్మిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్సార్ పార్టి నాయకులు తదితరులు పాల్గొన్నారు.