విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వివిధ సంక్షేమ పధకాల ద్వారా ఇంతవరకూ ఒక లక్షా 30 వేల కోట్లు ప్రజలకు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించామని, ఇది పేదల ప్రభుత్వమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు.
విజయవాడ శివారు పోరంకిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతీ సమితి ఆధ్వర్యంలో 8 అకాడమీలకు చెందిన కార్పొరేషన్ ల చైర్ పర్సన్ ల నూతన కార్యాలయాలను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ వర్గాలకు సంక్షేమ అభివృద్ధి పథకాల లోనూ, ప్రజా ప్రతినిధులుగా నియమించడంలోనూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సింహభాగం అందించి పేదల పక్షపాతిగా పేరుతెచ్చుకుందన్నారు. రాష్ట్రంలో 200 లకు పైగా కార్పొరేషన్ చైర్మన్ లను, 2 వేలకు పైగా డైరెక్టర్ లను నియమించారని వారిలో ఎక్కువ శాతం మహిళలకే అవకాశం కల్పించామన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విభజన ఉగాది నాటికి పూర్తి అవుతుందని మంత్రి అన్నారు. కాసే చెట్టుకే రాళ్లు వేస్తారని, చైర్మన్ లకు కుర్చీ లేదు, జీతాల్లేవని విమర్శిస్తున్నారని ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోవద్దని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు అన్నారు.
పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ శాసన సబ్యులకు ఉండే అధికారాలే చైర్మన్ లకు ఉన్నాయని ప్రజాప్రతినిధులుగా ప్రతిఒక్కరూ ప్రజలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని శాసన సభ్యులు కొలుసు పార్ధసారధి అన్నారు.
అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీ రాములు త్యాగ నిరతిని స్మరించుకుంటూ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, శ్రీ ధర్మశ్రీ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జునరావు, కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ వంగపండు ఉషశ్రీ, హిస్టరీ అకాడమీ చైర్ పర్సన్ నాగ మల్లేశ్వరి, నాటక అకాడమీ చైర్ పర్సన్ ఆర్. హరిత, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ టి. శ్రీ లక్ష్మి, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ ఆర్. ప్రభావతి, దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ శైలజ, జానపద మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …