Breaking News

రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ. 2,205 కోట్లతో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టాం…

-నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆర్ అండ్ బి రోడ్లలో మార్పు తీసుకువచ్చాం..
-10 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కారణంగానే నేడు ఆర్ అండ్ బి రోడ్లు దుస్థితి..
-రాష్ట్రంలో చేపట్టిన ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మత్తు పనులన్నీ జూన్ నెలాఖరు నాటికీ పూర్తి చేస్తాం..
-రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి ఎమ్. శంకరనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 8 వేల 268 కిలో మీటర్ల మేర రహదారులను రూ. 2205 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి ఎమ్. శంకరనారాయణ అన్నారు.  విజయవాడ రోడ్లు భవనాల శాఖ ఎచ్ ఓ డి బిల్డింగ్ లో గురువారం ఆర్.అండ్ బి. ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు తో కలిసి రాష్ట్రం లో ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధి పురోగతి పై మంత్రి పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఈసందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మొట్టమొదటి సారిగా ఇంతటి భారీ వ్యయంతో రహదారుల మరమ్మత్తులు, అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రం లోని వివిధ జిల్లాల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదలు, తుఫాన్ ల కారణంగా ఆర్ అండ్ బి రోడ్లు పాడైన వని అన్నారు. గత ప్రభుత్వాలు సరైన రీతిలో రహదారులను నిర్వహించని కారణంగా తమ ప్రభుత్వం ప్రతీ ఏటా సాధారణ మరమ్మత్తులు చేపడుతున్నప్పటికీ రాష్ట్ర రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్ లు ఆర్ అండ్ బి రోడ్లు ఉన్నాయని వాటిని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ విధానం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకొకసారి రోడ్ మెయింటెనెన్స్ క్రింద మరమ్మత్తులు చేపట్టవలసి ఉండగా గత 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రంలో ఈ గత రెండు సంవత్సరాల నుండి ప్రతీ సంవత్సరం ప్రభుత్వం 6 వేల కిలోమీటర్లు రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 2 వేల కిలోమీటర్లు మాత్రమే మరమ్మత్తులు నిర్వహించేవారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా తమ ప్రభుత్వం పై బురద జల్లుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో బి.జె.పి. తో పార్టనర్ ఉండి 10,660 కోట్లు కేంద్రం నుంచి తెచ్చారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బి.జె.పి. తో ఎటువంటి పొత్తు లేకుండా మూడు సంవత్సరాల్లో 11 వేల కోట్లు కేంద్రం నుండి నిధులు తెచ్చామని మంత్రి శంకరణనారాయణ అన్నారు.
రాష్ట్రంలో పురోగతిలో ఉన్న 233 రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేయుటకు రూ. 1158 కోట్ల రూపాయలు రుణాన్ని నాబార్డ్ నుండి నిడా పథకం క్రింద రుణాన్ని సేకరించి పనులు చేపట్టామన్నారు. వాటిలో 182 పనులు పూర్తి అయ్యాయని మిగిలిన 51 పనులు 2022 జూన్ నాటికి పూర్తి చేస్తామని వీటికి సంబంధించి ఇప్పటివరకు రూ. 568 కోట్లు బిల్లులను చెల్లించామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆర్ అండ్ బి రోడ్ల పై ఎక్కడా గోతులు ఉండకూడదని వాటిని ప్రణాళికాబద్ధంగా మరమ్మత్తులు చేపట్టుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా రూ. 2 వేల 205 కోట్లతో 1161 పనులను ఈసంవత్సరం రోడ్ల మరమ్మత్తు పనులను చేపట్టామన్నారు. జూన్ నెలాఖరు నాటికి ఈపనులన్నింటినీ పూర్తి చేయనున్నామని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు 1985 కోట్ల రూపాయల విలువైన 1024 పనులు సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగించడమైనదన్నారు. వాటిలో రూ. 697 కోట్ల విలువైన 343 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ. 158 కోట్ల విలువైన 118 పనులు పూర్తి అయ్యాయన్నారు. ఇప్పటివరకు రూ. 260 కోట్ల రూపాయలు పూర్తి అయిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించామన్నారు. ఈపనులన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేస్తామన్నారు.
నిడా పథకం క్రింద అదనపు ప్లాన్ వర్క్స్ పూర్తి చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 233 పనులకు అదనంగా 37 పురోగతిలో ఉన్న వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి నిడా పథకం రెండవ దశ క్రింద రూ. 570 కోట్లు ఋణం కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను నాబార్డ్ కు సిఫార్స్ చేసిందని త్వరలో అదనపు ఋణం మంజూరు కాగలదని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో పురోగతిలో ఉన్న 14 రైల్ మరియు రోడ్ వంతెన నిర్మాణ పనులను 486 కోట్ల నాబార్డ్ రుణ సహాయంతో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి అదనంగా రాష్ట్రంలో మరో 33 రైల్ మరియు రోడ్ల వంతెనల నిర్మాణ పనులను సి ఆర్ ఐ ఎఫ్ పథకం క్రింద చేపట్టనున్నామన్నారు. ఈ పథకం క్రింద మొత్తం నిర్మాణ పనులకు అయ్యే రూ. 1980 కోట్లు రహదారుల మంత్రిత్వ శాఖ భరిస్తుందని, భూ సేకరణకు అవసరమయ్యే రూ. 440 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అత్యధిక వాహన రద్దీ కలిగిన రహదారులను అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్ర రహదారులన్నీ జాతీయ రహదారులతో ప్రాముఖ్యమైన ప్రదేశాలతో అనుసంధానించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి వ్యవసాయ మరియు పారిశ్రామిక వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు రవాణా సులభతరం అవుతుందని తద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుందని రోడ్లు భవనాల శాఖా మంత్రి శంకరనారాయణ అన్నారు.
రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు మాట్లాడుతూ రాష్ట్రం లోని రహదారుల పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించామని ప్రతి జిల్లా సూపెరింటెండెంటింగ్ ఇంజనీర్ తో పాటు ప్రతి రెండు జిల్లాలకు చీఫ్ ఇంజనీర్ ను ఇంచార్జి గా నియమించి రహదారులపై సమగ్ర సర్వే నిర్వహించగా 8268 కిలోమీటర్లు రహదారులు అత్యవసరంగా మరమత్తులు చేపట్టవలసి ఉందని గుర్తించామన్నారు. ఇందుకు అనుగుణంగా రూ. 2205 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముందుగా మంత్రి శంకరనారాయణ మరమత్తులుకు సంబంధించి నాడు-నేడు రోడ్ల పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *