విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడ్కో గృహా లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కంచికచర్ల మండలం పరిటాలలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ( ఎస్‌డబ్ల్యుయంసి), గ్రామ సచివాలయ ఆకస్మిక తనిఖీ అనంతరం తిరుగు ప్రయాణంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ టెలికాన్ఫరెన్స్ ద్వారా టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుపై విజయవాడ, మచిలీపట్నం నగర పాలక సంస్థ, గుడివాడ, ఉయ్యూరు, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అధ్వర్యంలో వివిధ కేటగిరీల కింద ఏపి పట్టణ మౌలిక వసతుల సముదాయాల సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు.టిడ్కో గృహాలలో బ్లాకుల వారిగా 80శాతంపైగా పూర్తి అయిన వాటి వివరాలు, బ్యాంకుల ద్వారా మంజూరైన రుణాలు, వీటితోపాటు 50శాతం పైగా, 50 శాతం కన్న తక్కువ ఉన్న వాటి వివరాలను తక్షణమే అందించాలన్నారు. ముఖ్యంగా వారం వారిగా నిర్థేశించిన లక్ష్యాలను బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లతో అధికారులు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 19,376 వివిధ కేటగిరీలకు చెందిన టిడ్కో గృహా లబ్ధిదారులకు గాను 679 కోట్ల రూపాయల రుణ మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువను బట్టి 365 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో గృహాం 10 నుండి 12 లక్షల రూపాయలు, 430 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన డబుల్ బెడ్‌రూమ్ గృహా 13 నుండి 15 లక్షల రూపాయలు విలువ కలిగి ఉంటాయని అందువల్ల లబ్ధిదారులకు రుణాలు మంజూరు పై బ్యాంకర్లకు ఎటువంటి సందేహం అక్కర్లేదని కలెక్టర్ అన్నారు. మున్సిపల్ కమీషనర్లు, గృహా నిర్మాణ, టిడ్కో శాఖాధికారులు బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌లతో సమన్వయం చేసుకొని త్వరితగతిన రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె. నివాస్ అన్నారు.
ఈ టెలీకాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ రంజిత్‌బాషా, గుడివాడ, మచిలీపట్నం,ఉయ్యూరు, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపల్ కమీషనర్లు, బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్ బి. చిన్నొడు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …