-పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలల్లో నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత (వాష్) అనేది పిల్లల్లో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహిస్తుందని పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. బుధవారం విజయవాడలో పాఠశాల విద్యాశాఖ – యూనిసెఫ్, ఎస్ఎఆర్డీఎస్ (సోషల్ యాక్టివిటీస్ రూరల్ డెవలెప్ మెంట్ సొసైటీ), సీఈఈ (సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్) సంయుక్తాధ్వర్యంలో జరిగిన వాష్ కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, పరిశుభ్రత అలవాట్ల వల్ల స్వచ్ఛత రాయబారులుగా వ్యవహరిస్తారని అన్నారు. వాష్ ఇన్ స్కూల్స్ అలయన్స్ (WinsaAP) ఈ విషయంలో మరింత పురోగతి సాధించడానికి గణనీయంగా దోహదపడుతుందని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు అనేక విద్యా సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. మన బడి: నాడు – నేడు పథకం ద్వారా పాఠశాలలను ఉన్నతీకరించి చక్కని వసతులు కల్పించి, నాణ్యమైన విద్యను అందించడానికి సంకల్సించారని అన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని టాయిలెట్ మెయింటెన్స్ ఫండ్ ను ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా బాలికలు శానటరీ న్యాప్ కిన్స్ మార్చుకోవడానికి పాఠశాలల్లో, కళాశాలల్లో గదులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దైనందిన జీవితంలో వాడే మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకునేలా విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో అపోహాలు వదలించి అవగాహన తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడితే గొప్ప విజయం సాధించినవారమవుతామని అన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దీనికంటే ముందుగా మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ‘మన బడి: నాడు- నేడు’ వల్ల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మారాయని అన్నారు. ఒకప్పుడు పాఠశాలల్లో మరుగుదొడ్లు పాడైపోతాయని తాళం వేసి దుర్వినియోగ పరిచేవారు. ఇప్పుడు అలా కాకుండా బాలబాలికలు, టీచర్లు వాడుకోవడానికి వీలుగా నిరంతర నీటి వసతితో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగై, నమోదు శాతం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 44వేలమంది ఆయాలను నియమించామన్నారు. ప్రతి పాఠశాలకు వాష్ రూమ్ పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగిందన్నారు.
పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి ప్రసంగిస్తూ ‘మన బడి : నాడు- నేడు’ పథకం కింద 9 మౌలిక వసతుల కల్పనతో ప్రాజెక్టు ప్రారంభించి, ప్రస్తుతం 11 మౌలిక వసతుల కల్పన జరుగుతుందని అన్నారు. ఈ పథకాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించమన్నారని గుర్తు చేశారు.
యూనిసెఫ్ కంట్రీ ఆఫీస్ (న్యూఢిల్లీ) నుండి హాజరైన డా. ప్రతిభా సింగ్ దేశంలో వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో అమలు చేస్తున్న వాష్ కార్యక్రమం గురించి, పలు సంస్థలు చేస్తోన్న కృషిని, జాతీయ స్థాయిలో ఉన్న దృక్పథాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో SARDS ఎగ్జిక్యూటీవ్ సెక్రటరీ ఆర్.సునీల్ కుమార్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో వాష్ కార్యక్రమం గురించి ప్రభుత్వంతో కలిసి , ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా పని చేస్తే ద్వారా మరింత పురోగతి సాధించవచ్చన్నారు. కార్యశాలలో భాగంగా హాజరైన ప్రతినిధులు కార్యచరణా ప్రణాళికను తయారు చేశారు. రుతుస్రావం, పాఠశాల్లలో వాష్ నిర్వహణ వంటి అంశాలపై చర్చలు జరిపారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, యూనిసెఫ్ వాష్ స్పెషలిస్ట్ ఎ.వెంకటేష్, యూ.పావనీ సాయిరాం, కేజీబీవీ సెక్రటరీ జి.నాగమణి, సీఈఈ రీజనల్ కోఆర్డినేటర్ రెజిని సింప్సన్, సీఈఈ స్టేట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎం.వి.వ్రిజులాల్, యూనిసెఫ్ వాష్ కన్సల్టెంట్ ఎం.అర్జున్ ప్రసాద్, వాటర్ ఎయిడ్ స్టేట్ ప్రొగ్రాం డైరెక్టర్ రాజేశ్ రంగరాజన్ రాష్ట్రంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ , ఇండియా రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. బాలల సంఘం ప్రతినిథులు పాల్గొన్నారు. వాష్ కు సంబంధించి తెలుగు, ఇంగ్లీషు బ్రోచర్ ను అతిథులు ఆవిష్కరించారు.