-ఏ.పి.యు.డబ్ల్యు.జే. నేతలకు గవర్నర్ హామీ !
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ , ఏ.పి.యు.డబ్ల్యు.జే. నాయకత్వబృందం గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్ ను కలిసిన వారిలో ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు , జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ , ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు , ఉపాధ్యక్షుడు కే.జయరాజ్ , రాష్ట్ర కార్యవర్గసభ్యుడు చావా రవి ఉన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను యూనియన్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళారు. 15 అంశాల వినతిపత్రాన్ని వారు గవర్నర్ కు అందచేశారు. యూనియన్ నాయకుల వివరించిన సమస్యలను గవర్నర్ శ్రద్ధగా విన్నారు.
దేశంలో మీడియాలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని వాటిని అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని , ఎలెక్ట్రానిక్ మీడియాను కూడా కౌన్సిల్ పరిధిలోనికి తెచ్చేందుకు వీలుగా ప్రెస్ కౌన్సిల్ పేరును మీడియాకౌన్సిల్ గా మార్చాలని, కౌన్సిల్ లో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కొనసాగించాలని ,కౌన్సిల్ కు చైర్మన్ ను నియమించాలని యూనియన్ నేతలు గవర్నర్ కు విన్నవించారు. కార్మిక సంస్కరణల నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పార్లమెంట్ రద్దుచేసిందనీ, దాని స్థానంలో తెచ్చిన లేబర్ కోడ్ లలో నియమాల రూపకల్పన పని ఇంకా ప్రారంభం కాలేదని , దాంతో జర్నలిస్టుల వృత్తిభద్రత , వేతనభద్రత చిక్కుల్లో పడ్డాయని యూనియన్ నాయకులు వివరించారు. అక్రెడిటేషన్ నియమాలను పి.ఐ.బి.స్థాయిలో కఠినతరం చేయడంతో అర్హులందరికీ అక్రెడిటేషన్ లభించడంలేదని , నిజంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని యూనియన్ నాయకులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో అర్హులందరికీ అక్రెడిటేషన్లు జారీ కాలేదని గవర్నర్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్, ప్రమాద బీమా గత రెండు మూడు ఏళ్ళుగా పునరుద్ధరణ కాకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని యూనియన్ నాయకులు గవర్నర్ కు వివరించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థికసహాయం చేస్తామని జీవో ఇచ్చినా అమలు జరగలేదని దాంతో దాదాపు 130 జర్నలిస్ట్ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడుతున్నాయని వారు వివరించారు. యూనియన్ నాయకుల విజ్ఞప్తులను గవర్నర్ శ్రద్ధగా ఆలకించి ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ నియామకం, కరోనా మృతుల సంఖ్య గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినతిపత్రాన్ని పరిశీలిస్తానని , సమస్యల పరిష్కారంలో తనవంతు తప్పనిసరిగా కృషిచేస్తానని గవర్నర్ హామీఇచ్చారు. తొలుత గవర్నర్ ను యూనియన్ తరపున అంబటి ఆంజనేయులు శాలువాతో సత్కరించారు.
రచయిత , కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత అయిన , గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు యూనియన్ తరపున గురజాడ అప్పారావు నాటకం కన్యాశుల్కం ఇంగ్లీష్ అనువాదం ఓలి ప్రతిని , దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి ఇంగ్లీష్ అనువాదం “ది నైట్ దట్ రెయిన్డ్ నెక్టర్” ప్రతిని , ఆలూరి బైరాగి కవితల ఆంగ్ల అనువాదం ” బీయింగ్ ఈజ్ పెయిన్” ప్రతిని డి. సోమసుందర్ గవర్నర్ కు అందచేశారు. ఆయన తనకిచ్చిన పుస్తకాల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఐజెయు పిలుపుమేరకు మే 10 న జాతీయస్థాయిలో పలురాష్ట్రాల్లో జర్నలిస్టుల కోర్కెలదినం పాటించిన సంగతి తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇరవై జిల్లాలో కోర్కెలదినం పాటించారు. అదేరోజు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందచేయాలని యూనియన్ భావించింది. అయితే యూనియన్ ప్రతినిధి బృందానికి గవర్నర్ కార్యాలయం గురువారం సమయం ఇవ్వడంతో యూనియన్ నేతలు ఈరోజు గవర్నర్ ను కలిశారు.