Breaking News

ముందస్తుగా సాగునీటి విడుదలకు ప్రణాళికను ఖరారు చేసిన క్యాబినెట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడాదిలో మూడు పంటలు పండించే విధంగా రైతులకు అవకాశం కల్పించేందుకై ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు సాగునీటి విడుదలచేసే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఉన్న నదులు, జలాశయాల నుండి ప్రణాళికా బద్దంగా సాగునీటిని విడుదల చేసేందుకు షెడ్యూలును ఖరారు చేసింది. ప్రతి ఏడాది అనుసరించే వ్యవసాయ సీజన్ కంటే ముందుగానే రైతులు సాగును ప్రారంభించి ఏడాది ఆఖరులో సంభవించే తుఫానుల కంటే ముందుగానే వ్యవసాయ ఉత్పత్తులను రైతులు పొందే విధంగా ఈ ప్రణాళికను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి సంయుక్తంగా పాల్గొని క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను పాత్రికేయులకు వివరించారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాల్లో ఒకటైన సాగునీటి విడుదలకు క్యాబినెట్ సమావేశంలో ఖరారు చేసిన ప్రణాళికను తొలుత వీరు వివరించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠవేసిందన్నారు. సకాలంలో రైతుకు సాగునీటిని అందించి తద్వారా ప్రకృతి వైపరిత్యాల నుండి రైతులను కాపాడేందుకు ప్రతి ఏడాది కంటే ముందుగానే సాగునీటిని రైతులకు అందించే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఆ వివరాలను రాష్ట్ర జలవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయులకు వివరిస్తూ ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్ ను ప్రారంభించేందుకు అవసరమైన సాగునీటిని ముందుగానే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆయకట్టులోని రైతాంగానికి ముందుగానే ఈ ప్రణాళికను తెలియచేయడం వల్ల వారు అందుకు తగ్గట్టుగా సాగుకు సిద్దం చేసేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో దోహద పడుతుందన్నారు. గోదావరి డెల్టాకు దవళేశ్వర బ్యారేజ్ నుండి జూన్ 1 నుండి సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పోలవరం సూయిజ్ నిర్మాణం పూర్తిఅవడం వల్ల డెడ్ స్టోరేజ్ నుండి నీటిని విడుదల చేయడానికి అవకాశం కలిగిందన్నారు. పులిచింతల రిజర్వాయరులో 33 టి.ఎం.సి. నీరు ఉండటం వల్ల గుంటూరు చానల్ నుండి కృష్ణా డెల్టాకు జూన్ 10 నుండి సాగునీరు విడుదల చేస్తామన్నారు. పులిచింతల పునరావాస పనులకు తమ ప్రభుత్వం రూ.100 కోట్లు పైచిలుకు చెల్లించి పనులు పూర్తి చేయడం వల్ల పులిచింత రిజర్వాయరులో నీటిని నిల్వచేసుకునే సదుపాయం కల్గడం వల్ల ఈ అవకాశం ఏర్పడిందన్నారు. పట్టిసీమపై ఏమాత్రం కూడా ఆధార పడకుండా కృష్ణౌ డెల్టాకు నీటిని ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా నాగార్జున సాగర్ ఆయకట్టు క్రింద రైతులకు జూలై 15 నుండి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. సోమశిల ఆయకట్టుతో పాటు ఆ ప్రాజక్టుపై ఆధార పడే గండికోట, చిత్రావతి, బ్రహ్మం సాగర్ తదితర ప్రాజక్టుల ఆయకట్టులోని రైతులకు జూలై 10 నుండి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. 78 టి.ఎం.సి.ల సామర్థ్యం గల సోమశిల ప్రాజక్టులో 56 టి.ఎం.సి.ల నీరు ఇప్పటికే ఉన్నందున ముందుగానే సాగునీరు విడుదల చేసేందుకు అవకాశం కలిగిందన్నారు. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో గోరకల్లు రిజర్వాయరు, కర్నూలు అవుకు, గండి, ఎస్.ఆర్.బి.సి. ఆయకట్టులోని రైతులకు జూన్ 30 నుండి సాగునీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్తరాంద్ర ప్రాంతంలోని వంశధార, గొట్టా రిజర్వాయరు, తోటపల్లి, మడ్డువలస తదితర ప్రాజక్టుల ద్వారా సాగునీటి విడుదల తేదీలను త్వరలో ఖరారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం వల్ల ఖరీఫ్ ముందుగా ప్రారంభం అవుతుందని, సాధారణంగా తుఫానులు సంభవించే నవంబరు, డిశంబరు మాసాల కంటే ముందుగానే రైతుల చేతికి పంట అందే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అదే విధంగా రబీ కూడా ముందుగానే ప్రారంభం అయి మూడో పంట వేసుకునేందుకు రైతులకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు .
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి మాట్లాడుతూ సాగునీటి విడుదలకు ప్రణాళికను ఖరారు చేసి, రైతులకు ముందుగా తెలియజేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ ఒకే సారి సాగును ప్రారంభించే అవకాశం ఉంటుందని, తద్వార ధాన్యం వారి చేతికి ఒకే సారి రావడం వల్ల ధాన్యం సేకరణ లో ఎదురవుతున్న సమస్యలు కూడా సమసి పోతాయని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా సాగునీటి సలహా మండలి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతాంగానికి ఎటు వంటి ఇబ్బందులు లేకుండా రైతుభరోసా కేంద్రాల్లో తగినన్ని విత్తనాలు, ఎరువులు, పనిముట్లను కూడా నిల్వఉంచడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సూక్ష్మమైన అంశాలపై కూడా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించి రైతాంగం సంక్షేమానికి పెద్ద పీఠవేశారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *