-లబ్ధిదారులను చైతన్యవంతులను చేసి గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోండి..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం సూరంపల్లి సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్‌లో విద్యుత్ త్రాగునీరు పనులను వారం రోజులలోపు పూర్తి చేసి లబ్ధిదారులు గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లి సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్ పనులను సంబంధిత అధికారులతో కలిసి శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో నిర్మిస్తున్న నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న గృహా నిర్మాణం పథకం కింద పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. సూరంపల్లిలో సుమారు 102 ఎకరాలలో 4,060 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు కేటాయించిన సూరంపల్లి లేఅవుట్లో లబ్దిదారులు గృహా నిర్మాణాలను చేపట్టేందుకు విద్యుత్ త్రాగునీరు వంటి మౌలిక సదుపాయలు వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ హౌసింగ్ జిల్లా అధికారి శ్రీదేవిని ఆదేశించారు. లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వీలైనంత మంది లబ్దిదారులు గృహా నిర్మాణాల పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలలి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం సూరంపల్లి జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న మోడల్ గృహాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. లేఅవుట్ పనుల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ సత్యవతి, హౌసింగ్ జిల్లా అధికారి వి శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి ఎస్ రవికాంత్, కార్పొరేషన్ హౌసింగ్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.