నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త :
సిద్దేశ్వరం జలదీక్షకు రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి పార్టీలకు అతీతంగా వేలాదిగా తరలిరావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి కోరారు. నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో సోమవారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31 వ తేదీన సిద్దేశ్వరం జలదీక్ష సంఘమేశ్వరం ఆలయ సమీపంలోని కృష్ణా నదిలో వేలాదిమంది రైతులతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 11 వ తేదీ నుండి రాయలసీమలోని ఎనిమిది జిల్లాలలో వంద గ్రామాలకు పైగా సన్నాహక సమావేశాలు నిర్వహించామని కరపత్రాలు, గోడపత్రికలతో పాటు వివిధ రూపాలలో ముఖ్యమైన యాభై కి పైగా సభలు నిర్వహించామని అన్నారు. ప్రజా సంఘాలు, అన్ని పార్టీల రైతు సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, న్యాయవాద, వ్యాపార, స్వచ్ఛందసంస్థలతో సమావేశమై సిద్దేశ్వరం జలదీక్షకు తరిలిరావాలని ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. పార్టీలకు అతీతంగా వేలాదిగా జలదీక్షకు తరలిరావాలని కోరారు. ఇటీవల నంద్యాల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జిల్లా కలెక్టరు అద్యక్ష్యతన నిర్వహించి జిల్లా ఇన్చార్జి మంత్రి పాల్గొన్న రాయలసీమ రైతులు ఖరీఫ్ సీజన్ లో ఆయకట్టు సాగు చేసుకునేందుకు ఖచ్చితమైన తేదీని ప్రభుత్వం ప్రకటించక పోవడం బాధాకరమని అన్నారు. గోదావరి నది పరీవాహక రైతులకు, కృష్ణా – గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఖరీఫ్ సీజన్ లో నారుమళ్ళు వేసుకునేందుకు జూన్ మొదటి వారంలోనే తేదీలు ప్రకటించిన ప్రభుత్వం రాయలసీమ రైతులకు ఏ తేదీ నుండి ఎప్పటి వరకు సాగునీరు అందిస్తామని ప్రకటీంచక పోవడం రాయలసీమ రైతులను వివక్షకు గురి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది ప్రవహించి, శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగులకు చేరుకున్న తరువాతే రాయలసీమ రైతుల ఆయకట్టుకు నీరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం బాధిస్తుందని అన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం పైన 60 టి. ఎం. సీ. ల నీటిని పాలకులు నిల్వ ఉంచి ఉంటే ఈ రోజు శ్రీశైలంలో 870 అడుగుల నీటి మట్టం ఉండి ఉండాలి. కాని శ్రీశైలం రిజర్వాయర్ లో ప్రతియేటా కనీస నీటిమట్టానికి దిగువన 790 అడుగుల వరకు ప్రభుత్వమే తీసుకెళ్లి కృష్ణా డెల్టా ప్రయోజనాలను కాపాడుతూ నదిలోకి నీరు వచ్చాక రాయలసీమ రైతుల ఆయకట్టుకు నీరిస్తామని అనడం ప్రభుత్వ ద్వంద్వ నీతిని తెలియచేస్తుందని ఆయన అన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మించుకుంటే 60 tmc ల నీటిని నిల్వ చేసుకుని ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఖచ్చితమైన తేదీని ప్రకటించి సాగునీరు అందించవచ్చని బొజ్జా దశరథరామిరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.