-కండ్రికలో రూ. 40 లక్షల నిధులతో రెండు పార్కుల ప్రహరీల నిర్మాణానికి స్థానికులతో కలిసి శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం అందించేలా నియోజకవర్గంలో పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కండ్రిక రామాలయం వీధిలో 0.7 ఎకరాలలో విస్తరించిన రెండు పార్కుల పరిరక్షణలో భాగంగా కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ, కాలనీవాసులతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న 281వ సచివాలయ పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానిక పార్కులను పరిరక్షించాలని కాలనీవాసులు విన్నవించారు. ఖాళీ స్థలంలో చెత్తను పారవేయకుండా చూడాలని కోరారు. స్పందించిన ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇందులో భాగంగా రూ. 40 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో పనులకు బుధవారం శంకుస్థాపన నిర్వహించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నగరాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారకుండా ఉండేందుకు పార్కులు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. అంతేకాకుండా పార్కులతో నగరానికి మరింత అందం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. నెలన్నర నుంచి రెండు నెలల వ్యవధిలో పనులు పూర్తిచేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు వీఎంసీ సంయుక్తంగా నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు ఉద్ఘాటించారు. సమస్యను తన దృష్టికి తీసుకెళ్లిన ఒక్క రోజులోనే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా స్థానికులందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ(పార్కులు) ఏ.ఎస్.ఎన్. ప్రసాద్, ఏఈ పురుషోత్తం, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఎస్.కె.ఇస్మాయిల్, కొక్కిరిగడ్డ నాని, జె.శివ, మేడా రమేష్, భాష, జగన్నాథరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.