Breaking News

నగరంలో టిడిపి మాలల ఆత్మగౌరవ సభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ మాలల ఆత్మ గౌరవ సభ కార్యక్రమం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం జరిగింది. కార్యక్రమంలో ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ రేపు జరగబోయే మహానాడు కార్యక్రమానికి అందరూ హాజరై  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతాన్ని రాజకీయ లబ్ధి కోసం విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. కోనసీమ కు అంబేద్కర్ పేరు పెట్టడం అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మాలలకు తెలుగుదేశం పార్టీలో ప్రాథాన్యతపై చర్చించారు. అనంతరం సభలో ఈ క్రింది తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించడమైనది.

-తెలుగు దేశం ప్రభుత్వం దళితుల సంక్షేమం కొరకు సుమారు 24 సంక్షేమ పథకాలను అమలు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వై.సి.పి. ప్రభుత్వం ఆ పథకాలను రద్దు చేసి దళితుల నోట్లో మట్టికొట్టింది. ఈ పథకాలు అన్ని వెంకటనే పునరుద్ధరించాలని,
-జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైసిపి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దళితులు, మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దళితులు మరియు మహిళల మీద దాడులు అరికట్టాలి. వీరి రక్షణ కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని,
– షెడ్యూల్ కులాల (ఎస్.సి.) వర్గీకరణకు అనుకూలంగా వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన అంగీకార పత్రాన్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానించడమైనది.
-వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో మాలలకు అన్యాయం జరుగుతుంది. ఎస్.సి. సబ్ ప్లాన్ నిధులు మరియు కేంద్ర ప్రభుత్వం ఈ కులాల వారికి ఇస్తున్న నిధులను దారి మల్లించకుండా ఈ కులాల వారికి మాత్రమే వినియోగించాలని తీర్మానించడమైనది.
-ప్రభుత్వం బడ్జెట్లో ఎస్.సి.లకు కేటాయించిన నిధులను ఇతర కార్యక్రమాలకు మల్లించరాదు అని తీర్మానించడమైనది. మాలలకు కేటాయించిన ఇళ్ళ స్థలాలలో నిర్మాణాలు ఆగిపోయినాయి. వాటిని ప్రభుత్వమే పూర్తి చేసి -మౌలిక సదుపాయాలు అయిన రోడ్డు, డ్రైనేజిలు, మంచినీటి సౌకర్యాలను కల్పించాలని,
-తెలుగు దేశం ప్రభుత్వం అమరావతిలో ప్రారంభించిన అంబేద్కర్ స్మృతి వన్నాని దురుదేశపూర్వకంగా విజయవాడకు తరలించి దాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. స్మృతి వన్నానికి నిధులు కేటాయించి, త్వరిత గతిన పూర్తి చేయాలని,
-కాకినాడలో దళిత కులస్తుడైన వీధి సుబ్రహ్మణ్యం హత్యను ఖండిస్తున్నాము. నేరస్తుడైన అనంత ఉదయ భాస్కర్ను పెద్దల సభ నుండి సస్పెండ్ చేయాలని తదితర తీర్మానాలను తీర్మానించడమైనది.

ఈ కార్యక్రమంలో మాల మహాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ పీటర్ జోసెఫ్, జిల్లా ప్రెసిడెంట్ లెనిన్ బాబు , సిటీ ప్రెసిడెంట్ పృథివి వైభవ్, సిటీ యూత్ ప్రెసిడెంట్ బండి ప్రదీప్ కుమార్, సిటీ యూత్ వైస్ ప్రెసిడెంట్ బాల గోపాల్, 39వ డివిజన్ కార్పొరేటర్ దయాళ్ శ్రావణి, గన్నవరం డివిజన్ ఇంచార్జి రమాదేవి, పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు, వివిధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *