-జిల్లా యూనిట్ గా అమ్మకాలు చేపట్టాలి
-జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో ఉత్పత్తి చేసిన సేంద్రియ ఎరువు ను అందరికి అందుబాటులోకి తెచ్చి విక్రయించేందుకు అడుగులు వెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత సూచించారు. గురువారం బొమ్మూరు లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువు విక్రయ కేంద్రాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా . కె.మాధవిలత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోనే ప్రప్రధమంగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరు లో జగనన్న స్వచ్ఛ సంకల్పం* కార్యక్రమం లో సేంద్రియ ఎరువు అమ్మకాలను నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లా యూనిట్ గా విక్రయాలు చేపట్టాలన్నారు. సంప్రదాయ సేంద్రియ ఎరువుల వాడకం వల్ల చేకూరే ప్రయోజనాల గురించి రైతులలో అవగాహన పెంచాలన్నారు. అదే విధంగా ఇంటి వద్ద వివిధ రకాల మొక్కలను పెంచే వారికీ అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ పంచాయతీలలో ఉత్పత్తి కాబడుతున్న సేంద్రియ ఎరువు విక్రయానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకుగాను జన సంచారం ఎక్కువగా ఉండే రోడ్ల కూడళ్లలో, రైతు బజార్లలో సేంద్రియ ఎరువు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువును కలెక్టర్ చేతుల మీదుగా రైతులు అందుకున్నారు. చెత్త సేకరణ ద్వారా సేంద్రియ ఎరువు తయారీని మరింత పటిష్టతరం చేసి బొమ్మూరు గ్రామాన్ని పూర్తి స్థాయి స్వచ్ఛతా గ్రామంగా తీర్చిదిద్దాలని తద్వారా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ ఉద్దేశ్యాన్ని సాకారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జె. సత్యనారాయణ, రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీఓ కె.రత్నకుమారి, విస్తరణాధికారి వాణిశ్రీ బెహరా, పంచాయతీ కార్యదర్శి ఎస్.శ్రీనివాస రెడ్డి, సచివాలయం ఉద్యోగులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.