-57 వ డివిజన్ 236 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 57 వ డివిజన్ – 236 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండో రోజు ప్రజాదరణతో దిగ్విజయంగా సాగింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 747 గడపలను సందర్శించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? లేదా ఆరా తీశారు. చివరి గడప వరకు పథకాలు అందే విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ.. అహర్నిశలు వారికి తోడుగా నిలుస్తున్న సచివాలయ వ్యవస్థను ఈ సందర్భంగా అభినందించారు. ఈ ఒక్క సచివాలయ పరిధిలోనే ఇప్పటివరకు రూ. 3 కోట్ల సంక్షేమాన్ని అందించగలిగామంటే వాలంటీర్ వ్యవస్థతోనే అది సాధ్యపడిందన్నారు. పేదరికాన్ని పాలద్రోలడమే ప్రధాన అజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. పట్టాలు మంజూరైన లబ్ధిదారులకు క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. అలాగే శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపోతున్న ఇళ్లను పునర్మించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సాయంపై పేదలకు అవగాహన కల్పించాలన్నారు. మంచినీటి సదుపాయానికి సంబంధించి టెండర్లు పూర్తి చేయడం జరిగిందని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే కొత్తగా విస్తరిస్తున్న కాలనీలకు త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి సకల సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా జగనన్న ప్రభుత్వం
పర్యటనలో భాగంగా ఆటో కార్మికులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు ముచ్చటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని ఈ సందర్భంగా వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆటో డ్రైవర్లను కనీసం పట్టించుకోకపోగా.. పన్నులు, ఛలానాల రూపంలో వారి నడ్డి విరిచిందని గుర్తుచేశారు. అటువంటి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు, బాధలు స్వయంగా పాదయాత్ర ద్వారా గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని రూపొందించారని వెల్లడించారు. ఈ పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో సొంత వాహనం ఉన్న 2,200 మందికి ఈ ఆర్థిక సంవత్సరం రూ. 2.20 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. ఒక్క 57వ డివిజన్ లోనే 190 మందికి రూ. 19 లక్షల సాయం అందించినట్లు తెలిపారు. వీరిలో దాదాపు 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వారే ఉన్నారన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఈ నగదు వారిని ఎంతగానో ఆదుకుంటుందని పేర్కొన్నారు. వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫిట్ నెస్ ఫీజులను చెల్లించేందుకు ఈ ఆర్థిక సాయం దోహదపడుతుందన్నారు. లబ్ధిదారులు ఈ సాయాన్ని ఉపయోగించుకుని.. తమ వాహనాలను ఎప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అర్హతలు ఉండి జాబితాలో పేరు లేని వారు తగిన డాక్యుమెంట్లతో వార్డు సచివాలయాలను ఆశ్రయిస్తే.. జూన్ మాసంలో పథకం వర్తించేలా చూస్తామని తెలియజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడం వంటి నిర్ణయాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అటువంటి ప్రభుత్వంపై మహానాడులో తెలుగుదేశం నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమని మల్లాది విష్ణు అన్నారు. మహానాడుని ఒక పెద్ద మాయనాడుగా ఆయన అభిప్రాయపడ్డారు. పేద ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మనసులో మాట పేరుతో ఏకంగా ఒక పుస్తకమే ముద్రించిన చంద్రబాబునాయుడికి.. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుభవమంతా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడానికే సరిపోయిందన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజన, సచివాలయ వ్యవస్థ, నాడు-నేడు వంటి విప్లవాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతున్నారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ అనగానే ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి అనేక కార్యక్రమాలు జ్ఞప్తికి వస్తాయన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేదలకు మరింత భరోసా కల్పించే విధంగా అమ్మఒడి, పేదలకు ఇళ్ల నిర్మాణం, రైతుభరోసా, విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా వంటి నవరత్నాల పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారన్నారు.
పాలకుడిగా చంద్రబాబు పనికిరాడని 2019 ఎన్నికలలోనే ప్రజలు నిర్ణయించారన్న విషయాన్ని తెలుగుదేశం నాయకులు గుర్తుంచుకోవాలని మల్లాది విష్ణు అన్నారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, బద్వేలు ఉప ఎన్నికల్లోనూ టీడీపీని ప్రజలు పూర్తిగా పక్కనపెట్టారని గుర్తుచేశారు. ఇంత పెద్దఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో వైసీపీ నాయకులు ఉన్నారని చంద్రబాబు మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సొంత పార్టీలోని మంత్రి, ఎమ్మెల్యేపై మేమే దాడులు చేసుకుంటామా..? అని ప్రశ్నించారు. ఇకనైనా పచ్చ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు పంపడం మానుకోవాలని హితవు పలికారు. మరోవైపు సామాజిక న్యాయ భేరీ పేరిట ఈ నెల 28న నగరంలో జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని నగర ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) అరుణ్ కుమార్, ఏఈ(ఎలక్ట్రికల్) అనిల్, ఏఎంహెచ్ఓ రామకోటేశ్వరరావు, 29వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ్ళ ఆదినారాయణ, నాయకులు భోగాది మురళి, పఠాన్ నజీర్ ఖాన్, ఝాన్సీ రాణి, నెళ్లి గోవింద్, చెన్నకేశవరెడ్డి, బాల, భాగ్యలక్ష్మి, గౌస్య బేగం, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.