విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర, ఆరోగ్యవంతమైన గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా వీజువల్లీ క్లీన్ గ్రామంగా ఎంపిక చేసిన మైలవరం మండలం వెల్వడం గ్రామ పంచాయితీని శుక్రవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ద్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెల్వడం గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలన్నారు. గ్రామస్థులు ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత టాయిలెట్లను ఉపయోగించాలని, ఆరుబయట మలవిసర్జన చేయరాదని, మలవిసర్జన అనంతరం సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు రెండు మొక్కలను నాటాలని అన్నారు. పర్యావరణ అనుకూలమైన చేతిగుడ్డ, జనపనార సంచులను మాత్రమే వాడాలని ప్లాస్టిక్‌ను ఎట్టిపరిస్థితులోను ఉపయోగించరాదని కలెక్టర్ అన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని తద్వారా గ్రామం వీజువల్లీ క్లిన్ గ్రామంగా గుర్తింపు పొందడంలో తమ వంతు సహకారం ఉంటుందని కలెక్టర్ అన్నారు.
త్వరితగతిన చెల్లింపులకు చర్యలు తీసుకుంటా.. కలెక్టర్
జాతీయ రహదారి విస్తరణకు భూములను, స్థలాలను ఇచ్చి 4 సంవత్సారాలు అయినప్పటికి నేటి వరకు నగదు చెల్లింపులు జరగలేదని భూములను ఇచ్చిన వారు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్య పట్ల సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామి ఇచ్చారు.
గ్రామంలో తడిపొడి చెత్తను వేరుచేసే విధానాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్…
స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ద్య కార్మికులు ఇంటింటి నుండి సేకరిస్తున్న తడి, పొడి వ్యర్థాల సేకరణ, నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలపరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలన్నారు. గ్రామంలోని మురుగు కాలువలలో నీరు నిల్వ వుండకుండా ఎప్పటికప్పుడు బయటకు పోయే విధంగా ఏర్పాటు ఉండాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఇంటి ముందు చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకునే బాధ్యత వారిదే అన్నారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త డంపింగ్ చేయరాదని స్థానికులకు కలెక్టర్ సూచించారు. పారిశుద్ద్య కార్మికులు తడిపొడి చెత్తను వేరువేరుగా సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించాలన్నారు. స్థానిక ప్రజలు తడి పొడి చెత్తను కలిపి ఇవ్వకుండా వేరు వేరుగా అందించాలని కలెక్టర్ గ్రామస్థులకు సూచించారు
ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పరిశీలన…
వెల్వడం గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కేంద్రాన్ని పరిశీలించి ప్రాసెస్ చేస్తున్న విధానాన్ని, వర్మి కంపోస్ట్‌ను ఆసక్తిగా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు చెత్త నుండి సంపద తయారు చేసి కంపోస్ట్ ఎరువును రైతులు పంట భూములకు వినియోగించుకునే విధంగా నిర్వహణ కేంద్రాలు వుండాలని కలెక్టర్ అన్నారు.
వర్మీ కంపోస్ట్ ఎరువును కొనుగోలు చేసిన ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ
ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో తయారైన 15 కెజీల వర్మి కంపోస్ట్ ఎరువును కెజీ ఒక్కంటికి 10 రూపాయల చొప్పున ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సత్యనారాయణ కొనుగోలు చేసిన తమ ఇంటిలోని పూలమొక్కలకు వర్మి కంపోస్ట్‌గా వినియోగించుకునేందుకు కంపోస్ట్ ఎరువు కొనుగోలు చేయడం జరిగింది. పారిశుద్ద్య కార్మికులు, హరిత రాయబారులకు మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులను కలెక్టర్ పంపిణీ చేశారు.
మైలవరం మండలం చంద్రాల గ్రామ లేఅవుట్‌ను పరిశీలించిన కలెక్టర్…
నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో గృహా నిర్మాణాలు జరుపుకుంటున్న జగనన్న కాలనీ లేఅవుట్‌ను కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట గ్రామ సర్పించ్ ధర్మరాజు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎన్‌ఇ ఎన్.వి.వి. సత్యనారాయణ, డిఆర్‌డిఏ పిడి వెంకట్రావు, డిపివో చంద్రశేఖర్ తహాశీల్థార్ రోహిణిదేవి, యంపిడివో అమీర్‌బాషా, యంపిపి ప్రసన్నరాణి, వైస్ యంపిపి రత్నబాబు, స్థానిక నాయకులు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.