-రాష్ట్రవ్యాప్తంగా 404 పరీక్షా కేంద్రాలు.. మొత్తం 1,37,371 మంది విద్యార్థులు నమోదు.
-10 రోజుల్లో పరీక్షా ఫలితాలు..
-వివరాలను వెల్లడించిన డా. పోలా భాస్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET-2022)ను రాష్ట్ర వ్యాప్తంగా మే 29న నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా. పోలా భాస్కర్ తెలిపారు. పాలిసెట్ -2022 నిర్వహణకు రాష్ట్రంలో 26 జిల్లాలో 52 సహాయ కేంద్రాలు, 404 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1,37,371 మంది విద్యార్థులు 2022–23 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందడానికి పరీక్షకు నమోదు చేసుకున్నారన్నారు. పరీక్షా ఫలితాలను 10 రోజులలో ప్రకటిస్తామని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నాడు పోలా భాస్కర్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
ఈ సందర్భంగా డా. పోలా భాస్కర్ మాట్లాడుతూ.. గతంలో కంటే విద్యార్ధుల నమోదు సంఖ్య పెరిగిందని, 2020లో 88,484 మంది, 2021లో 74,884 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 2022లో ఒక లక్షా 37వేల 371 మంది నమోదు చేసుకున్నారన్నారు. పాలిసెట్ పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుందని, వాటిలో లెక్కలు 50 మార్కులు, భౌతిక శాస్రం 40 మార్కులు, రసాయనిక శాస్త్ర 30 మార్కులకు ఉంటుందన్నారు. వీటిలో ఓసీ, బీసీ విద్యార్థులకు 25 శాతం (30 మార్కులు) సాధించిన వారందరికీ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాసిన వారి అందరికీ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్ధులను ఉదయం 10 గంటల నుండి పరిక్షా కేంద్రము లోనికి అనుమతిస్తామని, నిర్ణీత సమయం ఉదయం 11 గంటల తరువాత పరీక్షా కేంద్రంలోనికి ఏ విద్యార్ధిని అనుమతించరని తెలిపారు. కొన్ని హాల్ టికెట్లలో ఫోటోలు బాగా పాతవిగా ఉండటంతో ప్రతి విద్యార్థి తనతో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు, పరీక్షలో పాల్గొనే సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవని తెలిపారు. పాలిసెట్-2022 ను ప్రశాంతముగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ లను, ఎస్పీలను, ఏపీఎస్ ఆర్టీసీ వారిని, వివిధ మున్సిపాలిటీలను, హెల్త్ డిపార్టుమెంటు వారి సహాయం ఇప్పటికే కోరడం జరిగిందన్నారు.
పాలిటెక్నిక్ కోర్సు వివరాలు పోలా భాస్కర్ వివరిస్తూ.. రాష్ట్రంలో మొత్తం 84 గవర్నమెంట్, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు 29 బ్రాంచ్ లలో 3 సంవత్సరముల డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు రూ.4,700 లు, ప్రైవేట్ పాలిటెక్నిక్ నందు రూ.25,000 లు ఫీజులు నిర్ణయించామన్నారు. 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17,004 సీట్లు, 175 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 53,565 సీట్లు… మొత్తం 70,569 సీట్లుఉన్నాయన్నారు. విద్యార్థి ఎక్కడ చేరినప్పటికీ ప్రభుత్వ పథకాలు అన్నీ అర్హులైన ప్రతి విద్యార్థికి వర్తిస్తాయన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంజినీరింగ్ వారికంటే పాలిటెక్నిక్ వారికే ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. పాలిటెక్నిక్ సిలబస్ లోనే స్కిల్ డెవలప్ మెంట్, ఎంప్లాయిమెంట్ స్కిల్స్ రెండూ కలిపి ఉన్నాయని, విద్యార్థులు తమ కోర్స్ పూర్తిచేసేసరికి ఉద్యోగానికి కావలిసిన నైపుణ్యం, స్వయం ఉపాధి అవకాశాలు సంపాదించుకోవచ్చని ఆయన తెలిపారు. బి.టెక్ ను డిప్లొమా ద్వారా పూర్తిచేసిన విద్యార్ధులకు 6 సంవత్సరముల సాంకేతిక అనుభవము ఉండటం వలన క్యాంపస్ రిక్రూట్మెంట్ ల నందు ప్రాధాన్యత ఇస్తారన్నారు. విద్యార్థులకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.