-భవిష్యత్‌లో మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అఖిల భారత సర్వీస్ నియామకాల కోసం నిర్వహించిన యూపిఎస్‌సి సివిల్స్- 2021 ఫలితాల్లో ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన మహ్మద్ అబ్దుల్ రవూఫ్ 309వ ర్యాంకును సాధించడం విద్యార్థిని విద్యార్థులకు స్పూర్తిదాయకమని ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆకాక్షించారు. అఖిల భారత సర్వీస్ నియామకాల కోసం నిర్వహించిన యూపిఎస్‌సి సివిల్స్ – 2021 ఫలితాల్లో దేశంలోనే 309 ర్యాంక్ సాధించిన మహ్మద్ అబ్దుల్ రవూఫ్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యుత్తమైన అఖిల భారత సర్వీసులలో అబ్దుల్ రవూఫ్ మంచి ర్యాంకును సంపాదించడం ఎన్‌టిఆర్ జిల్లాకే గర్వకారణం అన్నారు. భవిష్యత్‌లో రవూఫ్ మరిన్ని ఉన్నత శిఖరాలను ఆధిరోహించి పేదరికం లేని సమ సమాజ నిర్మాణానికి చేపట్టే కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. మహ్మద్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ సివిల్స్ సర్వీసు పరీక్షలో విజయం సాధించాలని సాధన చేశానని రెండు సార్లు విఫలమైనప్పటికి నిరాశ చెందకుండా పట్టుదలతో సిద్దమై 309 ర్యాంకును సాధించగలిగానన్నారు. ఇంతకుముందు నాబార్డ్‌లో మేనేజర్‌గా రెండేళ్ళ పాటు విధులు నిర్వర్తించడం జరిగిందన్నారు. ఈ విధి నిర్వహణ నాకు ఎంతో తొడ్పడిరదని నాబార్డ్‌లో పనిచేసిన ఎంతో మంది ఐఎఎస్ అధికారులు స్పూర్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని సివిల్స్ పరీక్షలకు సిద్దమైయ్యేందుకే కేటాయించుకున్నానన్నారు. నావిజయానికి తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, వ్యవసాయ శాఖలో పనిచేస్తూ నా విజయం వెనుక ఆహర్నిశలు సహకరించిన నా తల్లిదండ్రులు యండి ఇక్బాల్, గౌసియాబేగంలకు రుణపడి ఉంటానన్నారు. భవిష్యత్‌లో పేదల అభ్యున్నతకి కృషి చేస్తానని రవూఫ్ తెలిపారు. అభినందన కార్యక్రమంలో రవూఫ్ కుటుంబ సభ్యులు ఎన్‌జివో నాయకులు కె.విద్యాసాగర్, పి రమేష్, రామకృష్ణ, జె స్వామి తదితరులు ఉన్నారు.