-పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కోలేని చంద్రబాబు.. వార్ వన్ సైడ్ అంటూ మాట్లాడటం హాస్యాస్పదం
-62వ డివిజన్ లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు సంక్షేమం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు కానీ.. దేశంలోని మరే ఇతర ప్రభుత్వం కానీ సాటి రాదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62 వ డివిజన్ – 268 వ వార్డు సచివాలయం పరిధి న్యూ పాయకాపురం, 7 అపార్ట్ మెంట్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, పార్టీ శ్రేణులతో కలిసి దాదాపు 500 గడపలను శాసనసభ్యులు సందర్శించారు. ఎమ్మెల్యే సహా నాయకులు, అధికారులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుంటే ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చెప్పిన సమస్యల్ని పరిష్కరించేందుకు అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం కూడా వారికి మరింత సంతృప్తినిచ్చింది. వైఎస్సార్ సీపీ పాలనలో మూడేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా తాము పొందిన లబ్ధిని వివరిస్తూ.. అర్హతే ప్రామాణికంగా కలిగిన మేలు గురించి చెప్పడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ పరిధిలో గడిచిన మూడేళ్లలో రూ. 4 కోట్ల 15 లక్షల 37 వేల 288 రూపాయల సంక్షేమాన్ని అందించినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వివరించారు. అమ్మఒడి ద్వారా 525 మందికి రూ. 73.50 లక్షలు., విద్యాదీవెన ద్వారా 135 మందికి రూ. 13.72 లక్షలు., వైఎస్సార్ ఆసరా ద్వారా 40 గ్రూపులకు రూ. 42.97 లక్షలు., చేయూత ద్వారా 85 మందికి రూ. 15.93 లక్షలు., వాహనమిత్ర ద్వారా 23 మందికి రూ.2.30 లక్షలు., కాపు నేస్తం ద్వారా 19 మందికి రూ. 2.85 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 11 మందికి రూ.1.65 లక్షల ఈ ఆర్థిక సంవత్సరంలో సాయం అందించినట్లు వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆత్మస్తుతి పరనింద అన్న చందంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహారశైలి ఉందని మల్లాది విష్ణు అన్నారు. మహానాడు సక్సెస్ అంటూ చంద్రబాబు వేస్తున్న కుళ్లు జోకులు విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మహానాడుకు మించి సామాజిక న్యాయభేరి సభకు ప్రజలు తరలివచ్చారని గుర్తుచేశారు. అట్టర్ ఫ్లాప్ అయిన మహానాడుకి చంద్రబాబు చేస్తున్న పబ్లిసిటీ.. పిట్టల దొర మాటలను తలపిస్తోందన్నారు. కేవలం ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని, పచ్చ మీడియా ద్వారా ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. పొత్తులు లేకుండా ఇప్పటివరకు అధికారంలోకి రాని చంద్రబాబు కూడా వార్ వన్ సైడ్ అంటూ బీరాలు పలకడం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. వార్ వన్ సైడ్ అంటే ఏవిధంగా ఉంటుందో 2019 ఎన్నికల ఫలితాల సమయంలోనే చంద్రబాబుకి స్పష్టంగా తెలిసి వచ్చిందన్నారు. చంద్రబాబు ఇక ఎప్పటికీ మాజీ సీఎంగానే ఉంటారని, మళ్లీ సీఎం కాలేరని విమర్శించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో కనిపించని తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని డివిజన్ పర్యటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టి మోసపోయిన ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు తెలుగుదేశం నాయకులు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఈ(ఇంజనీరింగ్) అరుణ్ కుమార్, ఏఈ(ఎలక్ట్రికల్) కృష్ణారెడ్డి, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, డివిజన్ కోఆర్డినేటర్ వీరబాబు, నాయకులు మస్తాన్, రామిరెడ్డి, బోరా బుజ్జి, పద్మ, రెడ్డెమ్మ, హైమావతి, గ్రేసీ, అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.