-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా సూరంపల్లిలో 172 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం నిరుపేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సూరంపల్లిలోని వీఎంసీ లేఅవుట్ లో 172 ఇళ్ల నిర్మాణాలకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31 లక్షల మంది పేద కుటుంబాలకు సొంతింటి స్థలం మంజూరు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 30వేల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 6 లక్షలు విలువ చేసే ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా రూ. 270 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం హయాంలో విజయవాడ నగరంలో 10వేల ఇళ్లను తాము కట్టలేమని కౌన్సిల్ లో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం, టీడీపీ నాయకుల చేతగానితనానికి నిదర్శనమన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా.. రూ. 1 లక్షా 80 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోందన్నారు. అంతేకాకుండా లబ్ధిదారుని అవసరాన్ని బట్టి మరో రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బ్యాంకర్ల నుంచి రుణాన్ని సమకూరుస్తుందని వెల్లడించారు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులు ఎవరైనా ముందుకు వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమ ఆలస్యానికి కోర్టులలో తెలుగుదేశం నాయకులు వేసిన కేసులే కారణమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. లేకుంటే తొలి ఏడాదిలోనే పేదలందరూ గృహ ప్రవేశాలు చేసుండేవారని వెల్లడించారు. 4,060 ఇళ్లతో రూపుదిద్దుకుంటున్న కొండపావులూరు జగనన్న కాలనీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఓవైపు గృహ నిర్మాణాలు జరుగుతుండగానే మరోవైపు యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే శంకుస్థాపనలు జరిగిన ఇళ్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ(హౌసింగ్) రవికాంత్, ఎస్ఈ(వర్క్స్) భాస్కర్, కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అలంపూర్ విజయ్, ఇసరపు రాజా రమేష్, యరగొర్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణంపై అధికారులతో సమీక్ష
సెంట్రల్ నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణాలు, టిడ్కో గృహాలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన బుధవారం సమీక్ష జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ శాఖ, వీఎంసీ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డబ్బులు చెల్లింపుల గూర్చి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. దాదాపు రూ. 10.28 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీరిలో చాలా మందికి ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం పేదలందరికీ ఇళ్ల నిర్మాణంపై సుధీర్ఘంగా చర్చించారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ.. వారంతా త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవడంలో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి తోడ్పాటును అందించాలన్నారు. డ్వాక్రా గ్రూపులలో ఉన్న లబ్ధిదారులకు రుణం ఇవ్వడం ద్వారా ప్రాథమికంగా ఎక్కువ మొత్తంలో నిర్మాణాలను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. కావున లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా కాలనీలలో ప్రజలు నివసించేందుకు అనువుగా పూర్తిస్థాయిలో అన్ని మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా లేఅవుట్ లలో నీటి వసతి, విద్యుత్ సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంలో తాత్సారం తగదని, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలన్నారు. సొంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తోడ్పాటును అందించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. సమీక్షలో అడిషనల్ కమిషనర్ (జనరల్) శ్యామల, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) సత్యవతి, నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, హౌసింగ్ డీఈ రవికాంత్, డిప్యూటీ తహసీల్దార్ చంద్రమౌళి, సీవో శ్రీకాంత్, వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, యరగొర్ల శ్రీరాములు పాల్గొన్నారు.