-9 లెదర్ పార్కుల అభివృద్ధికి చర్యలు
-లిడ్ క్యాప్ సమీక్షలో మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చర్మపరిశ్రమను అభివృద్ధి చేయడంలో భాగంగా రూ.11.5 కోట్లతో రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న తొమ్మిది లెదర్ పార్క్ లను అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నామని వివరించారు.
రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్- లిడ్ క్యాప్) కార్యకలాపాలను మేరుగు నాగార్జున సమీక్షించారు. ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని వెన్నెలవలస( శ్రీకాకుళం), అడ్డాపుశీల(పార్వతీపురం), నూజివీడు(ఏలూరు), జి.కొండూరు (కృష్ణా), కల్లూరు పారిశ్రామికవాడ( కర్నూలు),అడిగొప్పుల(పల్నాడు), యడవల్లి (ప్రకాశం), రాచేపల్లి (అనంతపురం), మడకశిర(సత్యసాయి) జిల్లాల్లో తొమ్మిది లెదర్ పార్కులు ఉన్నాయని చెప్పారు. ఈ పార్కులకు గతంలో భూములను ప్రభుత్వం కేటాయించినా వీటిలో ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించని కారణంగా కొన్ని చోట్ల ఆ భూములను ఇతర ప్రజావసరాలకు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఆ విధంగా భూములను తీసుకున్న చోట ఆ భూములకు ప్రత్యామ్నాయ భూములను లిడ్ క్యాప్ కు కేటాయించాల్సిందిగా కోరుతూ ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. అదే విధంగా లెదర్ పార్కులలో మిగిలిన భూములను గుర్తించి అవి అన్యాక్రాంతం కాకుండా వాటికి సరిహద్దులను గుర్తించి, వాటిలో బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. లిడ్ క్యాప్ కు కృష్ణా జిల్లాలోని జి.కొండూరు లో 18 ఎకరాలు, ప్రకాశం జిల్లా యడవల్లిలో 27 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. ఈ రెండు లెదర్ పార్కుల్లో రూ.11.50 కోట్లతో చర్మ పరిశ్రమాభివృద్ధికి సంబంధించిన శిక్షణా కేంద్రాలను నిర్మించనున్నామని తెలిపారు. ఒక్కో పార్కులో భవనాలను నిర్మించడానికి రూ.5.75 కోట్లు, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి రూ.కోటి చొప్పున ప్రభుత్వం కేటాయంచడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లిడ్ క్యాప్ కు సంబంధించిన సొంత తయారీ కేంద్రాలు లేకపోవడం పై స్పందిస్తూ ప్రైవేటు వ్యక్తులు తయారు చేస్తున్న వస్తువులను లిడ్ క్యాప్ పేరిట విక్రయించడం కాకుండా లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో తోలు వస్తువుల తయారీకి సంబంధించిన సొంత యూనిట్లను ఏర్పాటు చేయాలని దీనికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని కోరారు. లిడ్ క్యాప్ సొంతంగా బూట్లు, బ్యాగులు వంటి వాటిని ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం కూడా ప్రోత్సహించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. లిడ్ క్యాప్ అధికారులు రాష్ట్రంలో చర్మ పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి పనులను చేపట్టే సమయంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సలహాలను కూడా తీసుకోవాలని, అందరి అనుమతితోనే ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకోవాలని సూచించారు. ఏ విషయంలోనైనా ఏకపక్షంగా నిర్ణయాలన తీసుకోవడం తగదని హితవు చెప్పారు. విజయవాడ నగరంలోని ఆటోనగర్ లో ప్రధాన రహదారిపై ఉన్న లిడ్ క్యాప్ స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న విషయంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ ఎండీ డోలా శంకర్, జీఎం స్వర్ణలత ఇతర అధికారులు పాల్గొన్నారు.