-3 మాసాల పాటు ప్రత్యేక పెంపకం పై శిక్షణ..
-శిక్షణ కొరకు 20 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నదీజలాల నుండి మత్స్య సంపద సేకరణకు గాను ప్రత్యేక నైపుణ్యతతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా మత్స్య శాఖాధికారి ఎమ్. దివాకర రావు ఒక ప్రకటనలో తెలిపారు.
కోస్తా జిల్లాలకు చెందిన ఆసక్తి కలిగిన మత్స్య కారులు, జాలరులు, సహకార సంఘ సభ్యులు, షెడ్యూల్డ్ కులాల, తెగల అభ్యర్థులు శిక్షణకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని ఏలూరు జిల్లా అధికారి ఆప్రకటనలో వివరించారు. చేపల పెంపకం, సేకరణలో తమకు ఉన్న అనుభవాన్ని ధ్రువీకరిస్తూ దరఖాస్తులను ఏలూరు జిల్లా కార్యాలయానికి గానీ, సహాయ సంచాలకులు, బాదంపూడి కార్యాలయానికి గానీ పంపించాలని దివాకరరావు సూచించారు. అభ్యర్థి కనీసం 5వ తరగతికి మించి అర్హత కలిగి తెలుగు వ్రాయడం, చదవ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు 18 ఏళ్ళ నుండి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి చేపల వేటలో శిక్షణకు సంబంధించి గతంలో పొందిన శిక్షణా పత్రం దరఖాస్తు నకలు జత పరచాలని దివాకరరావు వివరించారు. దరఖాస్తులను ఏలూరు జిల్లా మత్స్య కార్యాలయం మరియు సహాయ సంచాలకులు బాదంపూడి వారి కార్యాలయాల్లో పొందవచ్చన్నారు.
ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తులను మత్స్య శాఖ జిల్లా కార్యాలయంలో అందజేయాలని, 30 తేదీ నుండి ఇంటర్వ్యూ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితా అదే రోజు సాయంత్రం నోటీసు బోర్డు లో ప్రదర్శించడం జరుగుతుందని దివాకరరావు తెలిపారు. జులై 1వ తేదీ నుండి శిక్షణ ప్రారంభించి సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ముగియ నున్నట్లు చెప్పారు. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయని, అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని అయన తెలిపారు.
శిక్షణా కాలం 3 మాసాలలో మత్స్య క్షేత్రాలలో, రిజార్వాయర్ లలో చేపల పెంపకం, వేట సేకరణ వంటి విద్యతో కూడిన కోర్సు ను అందించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించడం జరుగుతుందని జిల్లా మత్స్య శాఖాధికారి దివాకరరావు తెలిపారు.
ఇతర వివరాలకు సంప్రదించవల్సిన సెల్ ఫోన్ నెంబర్ లు 9573337484 మరియు 9618008588.