-సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ పనులు యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలి
-కాంట్రాక్టర్ మరియు అధికారులను ఆదేశించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి బుధవారం వన్ టౌన్ కె.టి రోడ్ నిర్మాణ పనులు మరియు గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ పనుల యొక్క స్దితిగతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా కె.టి రోడ్ నందు జరుగుతున్న సి.సి రోడ్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సందర్భంలో రోడ్ పనులకు సంబందించి పూర్తి చేయవలసిన పనులు వేగవంతము చేయుటతో పాటుగా రోడ్ మద్యలో ఇంకను పూర్తి చేయవలసిన రెండు కల్వర్ట్ నిర్మాణాలు రెండు రోజులలో పూర్తి చేయాలని సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అదే విధంగా పనులలో జాప్యం జరగకుండా రెండో వైపు పనులు కూడా సత్వరమే చేపట్టునట్లుగా చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులకు సూచించారు. తదుపరి గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ యొక్క పనుల పురోగతిని పరిశీలించి చేపట్టిన అన్ని ఆధునీకరణ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేసి స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, వి.శ్రీనివాస్, ఏ.డి.హెచ్ శ్రీనివాసులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.