Breaking News

సంక్షేమంలో నూతన ఒరవడి సృష్టించిన జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో గురువారం రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జానారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమ్ముల విశ్వనాథం వీధి, రిలయన్స్ టవర్ వీధి, పాత పోస్టాఫీస్ రోడ్డు, న్యూ పోస్టాఫీస్ రోడ్డు, రామకృష్ణాపురం రెండో వీధిలో పాదయాత్ర నిర్వహించి.. 521 గడపలను సందర్శించారు. స్థానికుల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. చంద్రబాబు లాగా అబద్దపు వాగ్దానాలతో పేదలను మోసపుచ్చడం తమకు తెలియదని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని పారదర్శకంగా బుక్ లెట్ల ద్వారా వివరించగలిగిన ఏకైక ప్రభుత్వం దేశంలో జగనన్న ప్రభుత్వం ఒక్కటేనని చెప్పుకొచ్చారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అధికంగా దోమలపై ఫిర్యాదులు అందడంతో.. రెండు పూట్ల ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్స్ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. రైల్వే ట్రాక్ తో పాటు బుడమేరు వెంబడి పిచ్చి మొక్కలను తొలగించి అభివృద్ధి పరచేందుకు రూ. 8 లక్షల నిధులు కూడా మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతామని వెల్లడించారు. ఇరిగేషన్ మరియు వీఎంసీ అధికారులు కలిసికట్టుగా పనిచేసి.. బుడమేరు కాలవను బాగుచేయాలని సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. సచివాలయ వ్యవస్థ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు కళ్లుగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రివర్యులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. సార్వత్రిక ఎన్నికలలో 175 సీట్లు గెలుపొందేలా కృషి చేయాలని సూచించినట్లు వివరించారు. 151 సీట్లతో రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీగా అవతరించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అక్షర జ్ఞానం లేనివారు కూడా విద్యారంగంపై విమర్శలు గుప్పించడం విడ్డూరమన్నారు. విద్యా వ్యవస్థ గూర్చి మాట్లాడేటప్పుడు కాస్త జ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. యువత బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తోన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గత తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన పాఠశాలలను నాడు-నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి పరుస్తుంటే ఆ పార్టీ నాయకులు చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మరోవైపు మండలానికో కాలేజీ చొప్పున సెంట్రల్ నియోజకవర్గంలో రెండు మహిళ జూనియర్ కళాశాలలు రాబోతున్నట్లు వివరించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టి, విభజన హామీలను పూర్తిగా విస్మరించిన కేంద్ర పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్ల తమ అసమర్థ పాలనతో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని నిప్పులు చెరిగారు. మరలా ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని దుయ్యబట్టారు. జీవీఎల్ నరసింహారావు మాట్లాడే ముందు స్థాయి తెలుసుకుంటే మంచిదని సూచించారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ఆయుష్మాన్ భారత్ కు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే స్ఫూర్తి అని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదల ఆరోగ్యానికి పూర్తి భద్రత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ప్రస్తుతం గుండు సున్నా అని మల్లాది విష్ణు విమర్శించారు. అటువంటిది బీజేపీ రావాలని ఆ పార్టీ నాయకులు ఇస్తున్న స్లోగన్స్ చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఉన్న వారంతా తెలుగుదేశం బినామీలని.. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి బోర్డులు తిప్పేసిన బడాబాబులను పక్కనపెట్టుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జొన్నాడలో పోలీసుల పట్ల సోమువీర్రాజు ప్రవర్తించిన తీరు బాధకరమని మల్లాది విష్ణు అన్నారు. ఆలమూరు ఎస్సై శివప్రసాద్ పట్ల దురుసుగా ప్రవర్తించిన సోము వీర్రాజు తక్షణమే పోలీస్ శాఖకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈఈ (ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, నాయకులు భోగాది మురళి, సామంతకూరి దుర్గారావు, ముద్రబోయిన దుర్గారావు, మార్తి చంద్రమౌళి, పెద్దిరాజు, శ్రీను, పవన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *