Breaking News

పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

-30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల్ని బడిబాట పట్టించాలన్న ప్రధాన ఉద్దేశంతో విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో శుక్రవారం మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జానారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమ్ముల విశ్వనాథం వీధి, రామరాజు వీధి, హనుమాన్ టెంపుల్ రోడ్డు, పాత పోస్టాఫీస్ రోడ్డు, అద్దంకి వారి వీధి, సీతాదేవీ రోడ్డు, నెమలి కంటి వారి వీధులలో పాదయాత్ర నిర్వహించి.. 271 గడపలను సందర్శించారు. స్థానికుల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థను ప్రజలు హర్షిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నియోజకవర్గంలోని 96 వార్డు సచివాలయాలలో సగటున ఒక్కో సచివాలయ పరిధిలో రూ. 3 కోట్ల సంక్షేమాన్ని మూడేళ్లలో అందించినట్లు వివరించారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన తోడ్పాటుతో సెంట్రల్లో రూ. 170 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరై పనులు ప్రారంభమైన మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్.యు.బి.) విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కరోనా తీవ్రత మరియు వర్షాకాలం కారణంగా పనులలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు.

సెంట్రల్ లో విద్యకు రూ. వంద కోట్ల నిధులు అందజేత
పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఒక్క పేదవానికి నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో అమ్మ ఒడి, నాడు– నేడు, విద్యా దీవెన, వసతిదీవెన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థుల చదువులను బాధ్యతగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఏ ఏడాది ఫీజు రియింబర్స్‌ మెంట్‌ను అదే ఏడాదిలో చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రూ. 30 వేల వరకు మాత్రమే పథకం వర్తిస్తుందని నిబంధనలు విధించిందన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల చదువుకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా రూ. 14 కోట్ల నిధులను సెంట్రల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు అందజేసినట్లు వివరించారు. అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లుల ఖాతాలలో రెండేళ్లలో రూ. 85 కోట్ల 45 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ. వంద కోట్ల నిధులతో ఈ మూడేళ్లలో నియోజకవర్గంలోని విద్యార్థుల బంగారు భవితకు జగనన్న ప్రభుత్వం బాటలు వేసిందని పేర్కొన్నారు. ఇవిగాక నాడు – నేడు కార్యక్రమం ద్వారా 26 ప్రభుత్వ పాఠశాలల్లో 163 అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 19.56 కోట్ల నిధులతో పాటు.. ఆయా పాఠశాలల మరమ్మతులకు రూ. 12.17 కోట్లు మొత్తం రూ. 31.73 కోట్ల నిధులను వెచ్చించినట్లు వివరించారు. తమ చిన్నారులను ఉన్నత చదువులు చదివించుకోవాలనుకునే తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సాయాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం నేతలు స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు మత్రిభ్రమించి మాట్లాడినట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 చోట్ల ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించిన రోజే తెలుగుదేశం కార్యాలయానికి తాళాలు వేసి ఉంటే బాగుండేదని మల్లాది విష్ణు అన్నారు. 23 మందిలో కూడా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నా.. టీడీపీ నాయకుల తీరు మారలేదన్నారు. చివరకు పార్టీ లేదు.. బొ.. లేదు అన్న అచ్చెన్నాయుడు కూడా సీఎం జగన్ కు సవాళ్లు విసరడం దౌర్భాగ్యమన్నారు. 2019 ఎన్నికలలో చంద్రబాబు నుంచి అచ్చెన్నాయుడు, బోండా ఉమా వరకు బాదుడే బాదుడని తెలుగుదేశం నాయలను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని.. గత ఐదేళ్ల తమ పాలనలో ఎందుకు చేయలేకపోయారో రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అంతేగానీ బురద చల్లే కార్యక్రమాలు, గోబెల్స్ ప్రచారాలను మానుకోవాలని సూచించారు. చంద్రబాబు అసమర్థ పాలనలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకుంటున్న తక్షణ చర్యలతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత అదుపులోకి వస్తోందన్నారు. గృహావసరాలకు ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణంగా నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతోందన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో తగినంత విద్యుత్‌ దొరకని పరిస్థితులున్నా.. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు వీలైనంత మేర నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. వేసవిలో విద్యుత్‌ వాడకం పెరుగుతున్నందున ఉత్పత్తికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, 33వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు గుండె సుందర్ పాల్, ఇసరపు రాజారమేష్, భోగాది మురళి, సామంతకూరి దుర్గారావు, ముద్రబోయిన దుర్గారావు, మార్తి చంద్రమౌళి, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *