-ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం: హోం మంత్రి తానేటి వనిత
-ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి లబ్ధిదారునికి రూ. లక్ష విలువైన ఎల్ఓసి పత్రం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తోందని రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్ కు చెందిన లంకా పరశురాం గత కొద్దికాలంగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. లక్ష విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎల్ఓసి పత్రాన్ని లంకా పరశురాంకు స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి లబ్ధిదారునికి తానేటి వనిత అందజేశారు. అత్యవసర సమయాల్లో పేదలు ఆధునిక వైద్యసేవలు పొందేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తుందని హోం మంత్రి తెలిపారు. కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఆపద వస్తే అధైర్యపడొద్దని సూచించారు. ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వందలాది కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 881 మందికి రూ. 4 కోట్ల 8 లక్షల 60 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 85 మందికి రూ. 2 కోట్ల 19 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు వెల్లడించారు. కనుక అనారోగ్యంతో ఉన్న ఎవరైనా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నట్లయితే పార్టీలకతీతంగా వారికి సహాయనిధి విడుదలవుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గా, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.