Breaking News

మద్య విమోచన పోస్టర్ల ను ఆవిష్కరించిన ఆర్టీసీ యం.డీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన వాల్ పోస్టర్స్ -స్టిక్కర్లు- ఫోమ్ బోర్డులను ఈనెల 09వ తేదీ గురువారం ఉదయం 11:00 గంటలకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లోని ఆర్టీసీ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటి చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. సభలో ఆయన ప్రసంగిస్తూ, మద్యం దుష్ఫలితాలపై ప్రజలను జాగృతలను చేయడం ద్వారానే మద్య రహిత సమాజం సాధ్యమౌతుందన్నారు. ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటం ద్వారా పొగత్రాగడం తగ్గిందని, అదేవిధంగా, మత్తు పానీయాల పై విస్తృతంగా ప్రచారం జరగాలన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీ పోస్టర్లను ఆర్టీసీ బస్సులపై మరియు ఆర్టీసీ ప్రాంగణాలలో ఉంచడం ద్వారా కోట్లాది మంది ప్రజల చెంతకు మద్యం దుష్పలితాల ప్రచారం చేరుతుందన్నారు. ఈ మహాత్తర బాధ్యతను తీసుకున్న ఆర్టిసి ఎండి సి.హెచ్ ద్వారకా తిరుమలరావును, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అభినందించారు. విద్యార్థులలో చైతన్యం తీసుకురావడానికి ఈ విద్యాసంవత్సరంలో గ్రామ,మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన,వక్తృత్వ, ఆర్ట్ పోటీలను నిర్వహిస్తామని తెలియజేశారు. అన్ని డిగ్రీ,ఇంజనీరింగ్ కళాశాలలో మద్యం దుష్ఫలితాల పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాష్ట్రంలోని అన్ని టోల్ గేట్స్ దగ్గర బ్రీత్ ఎనలైజర్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.బహిరంగ మద్య సేవనం నిరోధించడానికి పోలీసు యంత్రాంగం సమాయాత్తం అవుతుందన్నారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన నాటి నుండి నాటుసారా,గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పానీయాల పై వేలాది కేసులు పెట్టి వేలాది మందిని అరెస్టు చేశారని,వేలాది వాహనాలను సీజ్ చేశారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో 15 చోట్ల వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసిందని వాటిని బలోపేతం చేసి ఉచితంగా చికిత్సను అందించడానికి కృషి జరుగుతుందన్నారు
ఆర్టీసీ ఎం.డి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ మద్యపాన వ్యసనం వలన జీవితంలో చాలా కోల్పోతారని పేర్కొన్నారు. మద్యం సేవించడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ముఖ్యంగా సంస్థ లోని డ్రైవర్లు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా డ్యూటి నిర్వహించాలని సూచించారు. మద్య పానం సేవించి డ్యూటీ లకు వచ్చే వారి పట్ల సంస్థలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. మద్యం సేవించడం వలన కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. ఈ సమస్య సామాజికంగా అందరికీ నష్టం కల్గించే అంశం కాబట్టి ఈ రోజు ఈ కమిటీ ద్వారా పోస్టర్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అందరిలో పరివర్తన తీసుకొచ్చేందుకు ఈ కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన పోస్టర్ లను,స్టిక్కర్లను,ఫోమ్ బోర్డ్స్ లను బస్టాండ్ ప్రాంగణాల్లో ఉంచుతామని, ఇతర జిల్లాలకు వెళ్లే రాష్ట్ర వ్యాప్త బస్సులపై అంటించి ప్రజలను జాగృతలను చేస్తామన్నారు.మద్యం సేవించి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల వచ్చే అనర్థాలను నిరోధించడానికి అందరం ఐక్యంగా కృషి చేయాలని కోరారు. పోస్టర్లు విడుదల చేసి అందరికీ అందజేశారు.
అనంతరం సంస్థ గురించి మాట్లాడుతూ తిరుమలలో ఇప్పటికే విద్యుత్ బస్సు ఒకటి అతి తొందరలో తిరుపతి-తిరుమల ఘాట్ రూట్లో ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఆగష్టు నెలాఖరుకు 50 బస్సులు, డిశ౦బరు చివరికి మరో 50 బస్సులు మొత్తంగా 100 వస్తాయని తెలిపారు.
అదే విధంగా అద్దె బస్సుల విషయంలో అద్దె బస్సుల యజమానులకు నిబంధనల మేరకే అద్దె చెల్లింపులు ఉంటాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరచడం జరగదని స్పష్టం చేశారు.
బదిలీల విషయంలో ఉద్యోగుల మీద కత్తి పెట్టినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, 5 సంవత్సరాలు పూర్తైన ఉద్యోగుల బదిలీ విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు లోబడి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. సంస్థలోని దూర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు స్వస్థలాలకు బదిలీ కోసం పెట్టుకున్న ఆర్జీలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు.
ఆర్టీసీ హౌస్, మొదటి అంతస్తు లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్లు ఏ. కోటేశ్వరరావు (అడ్మిన్),  పి.కృష్ణ మోహన్ (ఇంజినీరింగ్), జోన్ -2 ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్  జి.వెంకటేశ్వర రావు, ఎన్.వి.రాఘవ రెడ్డి (ఎఫ్.ఏ), ఇతర అధికారులు హాజరయ్యారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *