-అధికారులను ఆదేశించిన – నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిధిలోని ప్రధాన రహదారులలో ఏర్పడిన గుంతలను గుర్తించి యుద్దప్రాతిపదికన వాటిని పూడ్చివేయుటతో పాటుగా అవసరమైన ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా శనివారం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వన్ టౌన్ గణపతిరావు రోడ్ నందు జరుగుతున్న ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించిన సందర్భంలో చేపట్టిన ప్యాచ్ వర్క్ పనులు అన్నియు సాయంత్రం నాటికీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా గణపతి రావు రోడ్డు ను సిమెంట్ రోడ్ గా అభివృద్ధి పరచుటకు గాను రూ. 2 కోట్ల నిధులతో పిలువబడిన టెండర్ లను 22 జూన్ తేదిన తెరిచిన వెనువెంటనే సిమెంట్ రోడ్ పనులు చేపట్టి స్థానిక ప్రజలకు మరియు వాహనముల రాకపోకలను ఇబ్బంది లేకుండా నిర్దేశిత గుడువులోగా రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణ మూర్తి మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.